Weather Update : గొడుగు పట్టుకెళ్లాలో, గ్లూకోజ్ తాగాలో అర్థం కావట్లేదు.. క్లైమేట్ కన్ఫ్యూజన్ మామూలుగా లేదుగా
Weather Update : ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. కోస్తా జిల్లాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండగా, రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి. రైతులకు పంట నష్టం వాటిల్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం చిత్ర విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ సెగలు పుట్టిస్తుంటే, మరోవైపు ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలతో పలకరిస్తోంది. ఈ ఎండ-వాన దోబూచులాటతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోతుండగా, రైతన్నలు మాత్రం పంట నష్టంతో ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మన్నార్ నుంచి తెలంగాణ మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నేడు (గురువారం) తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
రాయలసీమలో నిప్పుల కొలిమి
కోస్తాలో వర్షాలు పడుతున్నా, రాయలసీమలో మాత్రం ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో బుధవారం అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఎండల ధాటికి వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 44 మిమీ, పోలవరంలో 37.7 మిమీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో ఉపరితల ఆవర్తనం
తెలంగాణలో కూడా వాతావరణం భిన్నంగా ఉంది. ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలుల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటివి జరుగుతున్నాయి. అయితే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మళ్ళీ 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, మళ్ళీ ఎండలు తీవ్రమవుతాయని అధికారులు పేర్కొన్నారు.
రైతన్నలకు తీరని నష్టం
సమ్మర్‌లో పడుతున్న ఈ అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న వానలకు అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి. నువ్వులు, రాగులు వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.