Srikakulam: పొదల మధ్య పసికందు.. ప్రాణం పోసిన మానవత్వం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో దారుణం జరిగింది. పుట్టిన గంటల వ్యవధిలోనే పొదల్లో వదిలేసిన మగ శిశువును స్థానిక మహిళ కాపాడింది.

Update: 2026-03-31 05:50 GMT

Srikakulam: పొదల మధ్య పసికందు.. ప్రాణం పోసిన మానవత్వం!

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఓ సంఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును కన్నవారే నిర్దాక్షిణ్యంగా పొదల మధ్య వదిలేసి వెళ్లారు.

సోమవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో బూరగాం గ్రామానికి చెందిన ఓ మహిళ తన పశువుల కోసం కుడితి తీసుకువచ్చేందుకు వెళ్తుండగా, సమీపంలోని మొల్లపొదల నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. కంగారుగా వెళ్లి చూడగా, అక్కడ దోమలు కుడుతూ, అప్పుడే పుట్టిన మగ శిశువు దీనస్థితిలో కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన సదరు మహిళ, వెంటనే ఆ శిశువును అక్కున చేర్చుకుంది. ఒంటిపై ఉన్న దోమలను తొలగించి, శుభ్రం చేసి గ్రామంలోని ప్రజలకు సమాచారం అందించింది. ఆలస్యం చేయకుండా శిశువును సమీపంలోని క్లినిక్‌కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆ శిశువును గ్రామానికి చెందిన దేవకి అనే మహిళకు అప్పగించారు. దేవకి కుమార్తెకు సంతానం లేకపోవడంతో, ఆ చిన్నారిని తామే పెంచుకుంటామని ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ పసికందు ఆ కుటుంబం నీడలో క్షేమంగా ఉన్నాడు. కన్నవారు భారమని వదిలేసినా, అపరిచిత మహిళ చూపిన చొరవ, దేవకి కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆ పసికందుకి పునర్జన్మను ఇచ్చాయని గ్రామస్థులు కొనియాడుతున్నారు.

Tags:    

Similar News