Oil Deposits : ఏపీలో ఆయిల్ నిక్షేపాల గుసగుసలు.. రంగంలోకి దిగిన చమురు సంస్థలు

Oil Deposits : నంద్యాల జిల్లా రుద్రవరం, చిలకలూరులో చమురు నిక్షేపాలున్నాయన్న వార్తతో ONGC రంగంలోకి దిగింది. శాంపిల్స్ సేకరించిన అధికారులు, ఆయిల్ నిల్వలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

Update: 2026-03-29 03:00 GMT

Oil Deposits

Oil Deposits : నంద్యాల జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. మన భూముల్లో చమురు నిధులు ఉన్నాయట కదా. రుద్రవరం, చిలకలూరు పరిసర ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు భారీగా ఉన్నాయన్న ప్రచారం స్థానికుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య యుద్ధం నడుస్తుంటే, ఇక్కడ మన సొంత గడ్డపై చమురు దొరికితే ఇక తిరుగుండదు కదా అని జనం తెగ చర్చించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా నంద్యాల జిల్లా రుద్రవరం ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నాయనే వార్త ఊపందుకుంది. రుద్రవరంతో పాటు చిలకలూరు పరిసరాల్లో కూడా గ్యాస్, ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో, అసలు నిజమెంతో తెలుసుకోవడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)తో పాటు మరికొన్ని చమురు సంస్థలు రంగంలోకి దిగాయి. అధికారులు నేరుగా ఫీల్డ్‌లోకి వచ్చి పరిశీలన చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

రంగంలోకి ONGC

ప్రజల నమ్మకం, ప్రాథమిక సమాచారం మేరకు చమురు సంస్థల ప్రతినిధులు రుద్రవరం, చిలకలూరు ప్రాంతాలను సందర్శించారు. అక్కడ భూమి లోపల గ్యాస్ లేదా ఆయిల్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి మట్టి, ఇతర శాంపిల్స్‌ను సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపి పరీక్షించిన తర్వాతే అసలు నిజాన్ని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరి కొన్ని రోజుల్లోనే దీనిపై ఒక అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శాంపిల్స్ సేకరించారన్న వార్తతో స్థానికుల్లో ఆశలు మరింత చిగురించాయి.

యుద్ధ మేఘాల వేళ.. నంద్యాల ఆశలు

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలైన్లు, గ్యాస్ సిలిండర్ రేట్ల పెరుగుదలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోనే చమురు నిక్షేపాలు ఉన్నాయని తేలితే, అది కేవలం జిల్లాకే కాకుండా మొత్తం దేశానికే పెద్ద ఊరట అవుతుంది. దేశీయంగా చమురు ఉత్పత్తి పెరిగితే దిగుమతి ఖర్చు తగ్గి, ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

నిజం తేలితే రూపురేఖలే మారిపోతాయి

ఒకవేళ శాంపిల్స్ రిపోర్ట్‌లో చమురు నిక్షేపాలు ఉన్నాయని గనక తేలితే, నంద్యాల జిల్లా రూపురేఖలే మారిపోతాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు రావడమే కాకుండా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రుద్రవరం, చిలకలూరు వంటి చిన్న గ్రామాలు పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయి. ప్రస్తుతం అందరి కళ్లు ONGC రిపోర్ట్ పైనే ఉన్నాయి. నిజంగానే ఆ గడ్డ కింద నల్ల బంగారం దాగి ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News