Makarampuram: మన గ్రామ బడి - మన అందరి బాధ్యత
Makarampuram: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని కంచిలి మండలం మకరాంపురం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
Makarampuram: మన గ్రామ బడి - మన అందరి బాధ్యత
Makarampuram: ప్రైవేట్ పాఠశాలలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, మన గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలియజేసే దిశగా కంచిలి మండలం మకరాంపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెయ్యిల హరికృష్ణ, ఉపాధ్యాయులు దుద్ది బాలరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం.
గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా సంభాషించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్ తరగతులు, విద్యార్థులపై చూపుతున్న వ్యక్తిగత శ్రద్ధ వంటి అంశాలను వివరించి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీయడమే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పాటు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధన కొనసాగుతుందని పేర్కొన్నారు. చదువు భవిష్యత్తుకు బలమైన పునాది అనే భావనను తల్లిదండ్రుల్లో నాటే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో కలిసి మన గ్రామ బడి - మన అందరి బాధ్యత అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి బడిని బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవి బెహరా, బొడ్డ స్వరూప, ప్రగడ భార్గవి, మల్లార్పు భవాని, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మల్ల సుందరరావు, అంగన్వాడీ టీచర్ సుజాత రౌళో తదితరులు పాల్గొన్నారు.