Ambati Rambabu: ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ambati Rambabu: ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు కిర్లంపూడిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
ముద్రగడతో భేటీ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు, లోకేష్‌లకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. వారు చేస్తున్న అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం" అని మండిపడ్డారు.
తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానం ద్వారా పోరాడతానని స్పష్టం చేశారు. ఇప్పటికే హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశానని, త్వరలోనే మరో రెండు పిటిషన్లు వేయనున్నట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తావనను అంబటి తీసుకువచ్చారు. "పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు, అంబటి రాంబాబును కొట్టినా, ముద్రగడ కుటుంబాన్ని తిట్టినా ఎవరూ అడగరని భావిస్తున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయం, అక్రమం" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి తన కులం (కాపు సామాజికవర్గం), తన పార్టీ (వైఎస్సార్‌సీపీ) సిద్ధంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అంబటి తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.