Yadadri: నేడు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన.. ఉదయం 11.55 గంటలకు మహోత్సవం ఆవిష్కృతం...

Yadadri: స్వామి వారికి ప్రథమ పూజలు చేయనున్న కేసీఆర్‌ కుటుంబం...

Update: 2022-03-28 03:27 GMT

Yadadri: నేడు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన.. ఉదయం 11.55 గంటలకు మహోత్సవం ఆవిష్కృతం...

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. సుమారు ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు పున:ప్రారంభం అవుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు రంగం సిద్ధం కాగా.., ముఖ‌్య అతిథిగా పాల్గొననున్న ముఖ‌్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది.

ప్రతిష్ఠామూర్తులతో ఉదయ 9గంటల 30నిమిషాలకు చేపట్టే శోభాయాత్రతో ఉద్ఘాటన మహాక్రతువు మొదలవుతుంది. మొదట శోభాయాత్ర ప్రధానాలయ రెండో మాడవీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి మాడవీధిలోకి ప్రవేశించగానే మహాకుంభ సంప్రోక్షణ చేపడతారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు.

ఉదయం 11గంటల 55నిమిషాలకు మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12గంటల 10నిమిషాలకు ప్రధానాలయ ప్రవేశంతోపాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర‌్శన ఉంటుంది. సరిగ్గా 12గంటల 20నిమిషాలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది. ఇక ముఖ‌్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రథమ పూజలు చేయనున్నారు.

సాయంత్రం 4 గంటలకు భక్తులకు స్వయంభువుల సర్వదర్శనం మొదలవుతుంది. ఇక ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నందున దాదాపు 2వేల మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్‌మ్యాప్ రూపొందించగా, ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

మొత్తానికి చారిత్రక ప్రాశస్త్యం, ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ప్రాంగణం.. ఇకపై నవ నవోన్మేషంగా, శోభాయమానంగా దర్శనమీయనుంది. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమైన దివ్యధామాన్ని ఇద్దరు స్ధపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు, వేయి 500 మంది కార్మికులు.. 66 నెలల పాటు శ్రమించి రూపుదిద్దిన మహాక్షేత్రం.

Tags:    

Similar News