వికారాబాద్ జిల్లాలో ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు
సెకండ్ ఫేజ్‌లో ఉత్కంఠగా కౌంటింగ్ ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు వికారాబాద్ జిల్లాలో లాటరీద్వారా సర్పంచ్ ఎంపిక
Won by a Single Vote: Nail-Biting Panchayat Poll Results Shock Telangana
రెండో విడత పంచాయతీ పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఒక్క ఓటు అభ్యర్థుల భవితవ్యాన్ని చాటింది. ఉత్కంఠ జరిగిన లెక్కింపులో ఒక్క ఓటుతో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్‌లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చెన్నూరు నవనీత ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి నక్క బుచ్చిబాబు ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని రాజామన్‌సింగ్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గగులోతు పటేల్ నాయక్ ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయ్యారు.
ఇటు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొంగర మల్లమ్మ ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డమీది తండా సర్పంచ్‌గా బాణావత్ సరోజ స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో రామడుగు హరీశ్ ఒక్క ఓటుతో గెలుపొందారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్ వెంకటేష్ ఒక్క ఓటుతో గెలుపొందారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కోండ్ర తార కేవలం రెండు ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్ అయ్యారు.
వికారాబాద్ మండలం జైదుపల్లిలో ఓ అభ్యర్థి లాటరీ ద్వారా సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన జైదుపల్లి నాగిరెడ్డి, మౌనిక శ్రీకాంత్‌రెడ్డికి చెరో 303 ఓట్లు రావడంతో అధికారులు టైగా ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం చిట్టీల ద్వారా లాటరీ తీయగా కాంగ్రెస్ అభ్యర్థి మౌనిక గెలుపొందారు.