Bathukamma 2025: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?

Bathukamma 2025: తెలంగాణ ఆడపడచుల పూల పండుగ బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగలో రోజుకో పేరుతో బతుకమ్మలను తయారు చేస్తారు.

Update: 2025-09-26 05:41 GMT

Bathukamma 2025: తెలంగాణ ఆడపడచుల పూల పండుగ బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగలో రోజుకో పేరుతో బతుకమ్మలను తయారు చేస్తారు. పాటలు పాడుతు... ఆటలు ఆడుతు గౌరమ్మను కొలుస్తారు. బతుకమ్మ పండుగ వచ్చిదంటే ప్రతీ ఇల్లు పూల గుభాళింపులతో పరవశించిపోతాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా ప్రతీ వీధిలోను సందడి సందడిగా కనిపిస్తుంది. ఐదు రోజుల పాటు బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. దీంట్లో భాగంగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ జరుపుకుంటారు. ఇవాళ బతుకమ్మలను పేర్చరు. ఎలాంటి నైవేద్యాలు సమర్పించారు. ఇందుకు కారణమేంటో తెలుసుకుందాం పదండి...

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు.

అమ్మవారి అలక వెనక ఆసక్తికర విషయాలే ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో కథ చెప్పినా... తెలంగాణ అంతటా ఆరో రోజును అలిగిన బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఎప్పుడో పురాతన కాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని దాంతో బతుకమ్మ అలిగింది అని అంటారు. అందుకే మొదటి ఐదు రోజులు బతుకమ్మ ఆటలు ఆడే ఆడబిడ్డలు... ఆరో రోజున బతుకమ్మను పేర్చరు. అలా ఆరో రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. మరో కథ ప్రకారం... అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారని.. సంహరించిన తర్వాత అమ్మవారు బాగా అలసిపోయారని ఆరోజు ఆమెకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని అందుకే బతుకమ్మ ఆడరని అంటారు. ఈ ఆరో రోజు బతుకమ్మ పేర్లలో కూడా కొన్ని తేడాలుంటాయి. కొంతమంది అర్రెం అని... మరికొందరు అలసిన బతుకమ్మ అని అంటారు.

అమ్మవారు అలకతో ఉంటారని... అందుకే పూలతో బతుకమ్మను తయారుచేయరు. గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు. కానీ, ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని, ఇంటి ముందు పాటలు పాడుతూ అమ్మవారిని పూజిస్తారు. రాత్రి పొద్దు పోయే వరకు ఆడి, పాడి అమ్మవారి అలక తీరింది అనుకుని ఇళ్లలోకి వెళ్లిపోతారు.

Tags:    

Similar News