Weather Updates: మరో వారం రోజుల పాటు వర్షాలు.. తెలంగాణాలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదు

Weather Updates | ఎటు చూసినా వానలే.. ఎప్పుడు చూసినా వానలే... 20 రోజులుగా వర్షం కురవని రోజు లేదంటే నమ్మకం ఉండదు.

Update: 2020-09-20 00:56 GMT

Weather Updates | ఎటు చూసినా వానలే.. ఎప్పుడు చూసినా వానలే... 20 రోజులుగా వర్షం కురవని రోజు లేదంటే నమ్మకం ఉండదు. అందువల్లే ఈ నెలలో ఇప్పటివరకు సధారణ వర్షపాతంతో పోలిస్తే అధికంగా నమోదయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగా తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ చెబుతోంది. ఇది మరింత తీవ్రమయితే మరో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉంది. అయితే ఈ వానలు రైతన్నలకు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటి వల్ల ఖరీఫ్ లో సాగు చేసిన పంటలకు నీరు ఇబ్బంది లేకుండా సరిపోతుంది. అయితే ఈ వానలు మరింత ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని రైతులు అభిప్రాయపడుతున్నారు.

వారం రోజులుగా వానలే వానలు. రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నెల తొలివారంలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. ఈనెల పదో తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలే కురవగా 12వ తేదీ నుంచి మళ్లీ ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున ప్రతీ రోజు వానలు కురిసి నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతు న్నాయి. సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటు వర్షపాతం 12.7 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. ఈ లెక్కన ఈ నెల 19వ తేదీ నాటికి వర్ష పాతం 8.18 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా.. శనివారం నాటికి ఏకంగా 14.8 సెంటీమీటర్లు కురి సింది. సగటు వర్షపాతానికి రెట్టింపు, నెల సాధా రణ వర్షపాతం కంటే 20 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

మరో వారం రోజులు వానలు...

ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి ఈనెల 20వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతికేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంవల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఈ నెల 20న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇది 24 గంటలు గడిచిన తర్వాత వాయవ్య బంగాళాఖాతం వైపు బలపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.   


Tags:    

Similar News