Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు

వర్షాకాలం వచ్చినప్పటికీ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, సి.ఆర్.నగర్, డబ్బా వంటి గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.

Update: 2025-09-24 08:57 GMT

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు

వేసవిలోనే కాదు.. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం పల్లె ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిర్వహణలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లోపం కారణంగా.. కొన్ని గిరిజన గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే సేవించి రోగాల బారిన పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో నీళ్ల కోసం మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి పలు గ్రామాల్లో మంచి నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీటి సమస్యలపై అధికారులు, పంచాయతీ సిబ్బంది కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తాగు నీటి కోసం కాగజ్ నగర్ మండలం సిఆర్ నగర్ ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించి నిరసనలు చేశారు. చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామ ప్రజలు సైతం రోడ్డెక్కారు. ఓవైపు గత కొన్ని రోజులుగా పలు గ్రామాలలో చేతి పంపులు చెడిపోయాయి. మరో వైపు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాగు నీరు, కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామానికి దూరంగా ఉన్న బోర్లు, బావుల నుంచి ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. ఎన్నికలు సమయంలో నాయకుల ఓట్ల కోసం గ్రామలకి వస్తారని.. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మాత్రం నాయకులు కనిపించరని తెలిపారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తే పంచాయితీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని.. లేకపోతే ఎన్నికలను భహిష్కరిస్తామన్నారు.

వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల సీజనల్ వ్యాధులు, డయేరియా వంటి రోగాల బారినపడుతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును అధికారులకు వినిపించికున్నా.. వారు మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుకున్నారు.

Tags:    

Similar News