Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పల్లెల సెల్ఫ్‌‌లాక్‌డౌన్

Mahbubnagar: పలు గ్రామాల్లో వలస కార్మికులు తిరిగి రావడంతో సెల్ఫ్‌ లాక్‌డౌన్

Update: 2021-04-22 06:10 GMT
విల్లెజ్ సెల్ఫ్ లాక్ డౌన్ (ఫైల్ ఫోటో)

Mahbubnagar: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రాత్రి వేళల్లో కర్ఫ్యూ ను కొనసాగిస్తుండగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కరోనా వైరస్ పై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. తమ గ్రామాల్లో సొంతంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో స్వీయ నియంత్రణ కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వారం పది రోజుల్లోనే పదివేల పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 10 మంది మృతి చెందారు. ప్రతీ రోజు 500 వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. దుకాణాల దగ్గర మాస్క్‌, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్‌పై ఎలాంటి ఆదేశాలివ్వకపోయినా తామే సొంతంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో దాదాపు 5 గ్రామాల్లో ప్రజలు స్వీయ లాక్ డౌన్ విధించుకుని కఠినంగా అమలు చేసుకుంటున్నారు.

ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో గత పది రోజులుగా స్వీయ లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇటు చౌదరిగూడెం మండల కేంద్రంలోనూ వారం రోజుల క్రితం గ్రామ పంచాయతీ సెల్ఫ్‌ లాక్ డౌన్ విధించింది. ఇక కొందర్గు మండలంలోని ఎలికట్ట, వెంకీరాల గ్రామాలల్లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయితే నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇక ఈ సమయాల్లో కూడా గ్రామాల్లో మస్కు తప్పనిసరిగా వాడాలని లేకుంటే 100 జరిమానా విధిస్తున్నారు.

ఇటు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోనూ పలు గ్రామాలలో సెల్ఫ్‌ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఊట్కూర్ మండలంలోని ఎడివెళ్లి, పెద్ద జట్రం గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్‌లోకి వెళ్లింది. ఈ రెండు గ్రామాల నుంచి వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చిన కారణంగా ఎడివెళ్లి గ్రామంలో 14 కేసులు, పెద్ద జట్రంలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు.

అయితే.. రెండో దశలోను కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మొదటి సారి లాక్ డౌన్ విధించిన సమయంలో కేవలం రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రోజు 500 వందలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నారు. దీంతో కరోనాను కొద్ది వరకైనా కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి.

Tags:    

Similar News