ఓవరాక్షన్‌ చేస్తే అంతుచూస్తాం: సీపీపై ఉత్తమ్‌ ఫైర్‌

Update: 2019-12-28 12:24 GMT

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్‌పై మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఆరోపించారు ఉత్తమ్. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌ ఆవరణలో కాంగ్రెస్‌నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు సీపీ అంజనీకుమార్‌ అనుమతిచ్చారు కానీ, కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతామంటే అనుమతి నిరాకరించారు. గాంధేయ పద్ధతిలో గాంధీభవన్‌లో నిరసన తెలుపుతాం అని చెప్పినా పట్టించుకోలేదు. మా జెండా ఆవిష్కరణకు మా కార్యకర్తలకు అనుమతి లేదంటున్నారు. గాంధీ భవన్‌ చుట్టూ పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముంది? నగర సీపీ వైఖరి సరిగా లేదు. ఓవరాక్షన్‌ చేస్తే అంతు చూస్తాం వదిలిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. అంజనీకుమార్ చిట్టా తీసి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంజనీ కుమార్ ఆర్ఎస్ఎస్, కేసీఆర్‌లకు తొత్తుగా మారాడని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అవమాన పరిచేలా ప్రవర్తించాడంటూ అంజనీకుమార్‌పై మండిపడ్డారు. అంజనీ కుమార్ నీ సంగతి చూస్తాం ఉద్యోగం చేసుకోవడానికి వచ్చావ్ నీ ఉద్యోగం నువ్వు చేసుకుని పో అంటూ హెచ్చరించారు. 

Tags:    

Similar News