Rewind 2022: 2022తో ముగిసిన 2 దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానం..

Rewind 2022: 2022తో ముగిసిన 2 దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానం..

Update: 2022-12-31 14:00 GMT

BJP: బీఆర్ఎస్ పేరుతో కొత్త శకం ప్రారంభం.. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నాలు

BRS: రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానం 2022తో ముగిసి బీఆర్ఎస్ పేరుతో కొత్త శకాన్ని ప్రారంభించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో కారు పార్టీ ఈ యేడాది చివరలో ఇబ్బంది పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం నోటీసులు, ఎమ్మెల్యేల ఎరను ఛేదించామని చెబుతున్నా మునుగోడు బై పోల్లో విక్టరీ కొట్టినా బీఆర్ఎస్‌కు మైలేజ్ రాకపోవడం డిఫెన్స్‌లో పడేసినట్లే అయింది. 2022లో టీఆర్ఎస్ నుంచి.. సరికొత్త ప్రస్థానం మొదలు పెట్టింది.

అధికార బీఆర్ఎస్ పార్టీకి 2022 లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే యేడాదిగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా 2001ఏప్రిల్ 27న పుట్టిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాల ప్రస్థానం.. 2022లో ముగిసింది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని సరికొత్త అడుగులు మొదలు పెట్టింది. 21 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. చివరి ద్విదశాబ్ది ఆవిర్భావ వేడుకలను ఈ యేడాది ఏప్రిల్ 27న హైటెక్స్‌లో గ్రాండ్‎గా నిర్వహించారు పార్టీ అధినేత కేసిఆర్. హైదరాబాద్ HICC లో నిర్వహించిన ప్లీనరీలో13 తీర్మానాలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన కేసీఆర్ దేశంలో కొత్త పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ స్థాయికి విస్తరించాలని ప్రతిపాదనలు వస్తున్నట్లు ఆరోజే నేషనల్ పార్టీపై క్లారిటీ ఇచ్చేశారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ ఏడాది ఆరంభం నుంచే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ కోసం ఫైనల్‌గా టీఆర్ఎస్‌ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు. అజెండాను సిద్ధం చేసి అక్టోబర్5 విజయ దశమి రోజు తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చాలని తీర్మానం చేశారు. వెంటనే పార్టీ పేరు మార్పు కోసం ఎన్నికల సంఘానికి అప్లై చేసుకోవడంతో.. డిసెంబర్ 8న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, BRS పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మర్నాడే భారత దేశ చిత్రపటంతో బీఆర్ఎస్ కొత్త జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. డిసెంబర్ 14న ఢిల్లీలో BRS పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ను ప్రారంభించారు.

2021 చివరిలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలోకి వెళ్లిన గులాబీ పార్టీ..2022లో కూడా మునుగోడు బై ఎలక్షన్‌తో మరో కఠిన పరీక్షను ఎదుర్కొంది. గెలిచి తీరాలన్న కసితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం.. కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. సర్వ శక్తులు పెట్టారు. ఎర్ర జెండా పార్టీల మద్దతు తీసుకుని మరీ మునుగోడులో విజయం సాధించారు. అయితే 10 వేల మెజార్టీతో మాత్రమే రావడంతో ఆ విక్టరీ బీఆర్ఎస్‌లో పెద్దగా జోష్ నింపలేక పోయిందని పొలిటికల్ సర్కిల్స్ టాక్.. అయితే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసామనే ఆనందం మిగిలింది.

మునుగోడు ఉప ఎన్నికల హీట్ ఒక వైపు కొనసాగుతుండగానే తెరమీదకు వచ్చిన ఎమ్మెల్యేల ఎరకేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్టోబర్ 28న ఓ ఫామ్ హౌజ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు వ్యక్తులు బేరసారాలు చేశారని వీడియోలు బయటకు వచ్చాయి. దాన్ని రివర్స్ స్టింగ్ ఆపరేషన్‌తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలను పోలీస్‌ల సపోర్టుతో తిప్పికొట్టినట్లు అధికార పార్టీ చెప్పింది. తమ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందని వాదిస్తోంది. ఫామ్ హౌజ్ ఎపిసోడ్ మీద పోలీసులు కేసులు నమోదు చేయడం, ఆపై దర్యాప్తు కోసం ప్రత్యేకంగా సిట్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత సిట్ వ్యవహారం హైకోర్టుకు చేరడం తదనంతర పరిణామాలు బీఆర్ఎస్‎కు కొంత ఇబ్బందికరంగా మారాయి.

ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్‌ను బెంబేలెత్తించాయనే చెప్పొచ్చు. గులాబీ పార్టీ నేతల వ్యాపారాలు టార్గెట్‌గా వరుస దాడులతో అష్ట దిగ్బంధనం చేయడంతో ఇబ్బందుల్లో పడింది. మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు ఇళ్లలో, కాలేజీల్లో ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏతో పాటు ఆయన సోదరులను ఈడీ విచారణ చేసింది. ఎంపీ రవిచంద్ర, మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీ రైడ్స్ చేసింది. విదేశాల్లో వ్యాపార పెట్టుబడుల కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి 2 రోజులు విచారణకు పిలిచింది. ఇక క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్.రమణను ఈడీ విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం బీఆర్ఎస్ పార్టీని ఓ రేంజ్లో కుదిపేసింది. ఇక తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ నోటీస్ ఇచ్చి విచారించడం కలకలం రేపింది.

ఇటు గవర్నర్, అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ మరింత ముదిరింది. జనవరి 26న గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. అంతేకాదు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్‌ను మరింత పెంచింది. సమ్మక్క సారలమ్మ జాతరకు హెలికాప్టర్ సమకూర్చకపోవడం వివాదాస్పదమయింది. ఇలా ప్రతీ అంశంలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వంతోనూ వైరం కొనసాగించిన సీఎం 4 సార్లు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆయన్ని కలవలేదు. ఏడాది చివర్లో రాష్ట్రపతి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ తమిళిసై కేసీఆర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్‎ను కేసీఆర్ ప్రెసిడెంట్ ముర్ముకు పరిచయం చేశారు. ఇది తప్ప బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగానే సాగుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చాలాసార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసింది.

మరోవైపు బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. మెజారిటీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, ఆశావహులు మధ్య గ్రూపు తగాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇక కొందరు నేతలు కారు దిగి అధికార పార్టీకి షాకిచ్చారు. అలాగే టికెట్స్ కోసం చాలా మంది నేతలు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం.. కారు పార్టీని కలవర పెడుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో కేసీఆర్ పార్టీని ప్రిపేర్ చేయడంపై ఫోకస్ పెట్టారు. అభివృద్ది పనుల ప్రారంభం పేరుతో జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తూ సభలతో కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని అలాగే తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో 2023 లోకి అడుగుపెడుతోంది.

Tags:    

Similar News