తెలంగాణలోని 33 జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 మంది ఎంపీల ఎన్నిక కోసం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల 5 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 77 వేల 365 బ్యాలెట్ యూనిట్లు, 41 వేల కంట్రోల్ యూనిట్లు, 43 వేల 894 వీవీప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగించనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా..
అత్యల్పంగా మెదక్ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల కోసం మొత్తం 34 వేల 604 పోలింగ్ స్టేషన్లను రెడీ చేశారు. అయితే వీటిలో 6 వేల 445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుండగా.. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటలనుంచి 8 గంటల వరకు అక్కడ మాక్ పోలింగ్ జరగనుంది. ఆ తరువాతే సాధారణ పోలింగ్ మొదలు కానుంది.