Telangana: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

Telangana: డా. బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావులను ఎంపిక చేసిన కేసీఆర్

Update: 2022-05-19 01:23 GMT

Telangana: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

Telangana: రాజ్యసభకు వెళ్లనున్న టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది. మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు, గాయత్రి గ్రానైట్స్ అధినేత, టీఆర్ఎస్ నాయకుడు గాయత్రి రవిని రాజ్యసభ సభ్యులుగా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. బండ ప్రకాశ్​, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఈ ముగ్గురు నేతలను పెద్దల సభకు పంపాలని గులాబీ బాస్ నిర్ణయించారు.

వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమీకరణలను పరిశీలించిన కారు పార్టీ నాయకత్వం రెడ్డి, వెలమ, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేసారు. బండ ప్రకాశ్​ రాజ్యసభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. బండ ప్రకాశ్​ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. బండ ప్రకాశ్​ స్థానంలో గాయత్రి రవి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మరోవైపు ధర్మపురి శ్రీనివాస్ , కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. గులాబీ బాస్ కేసీఆర్​కు సన్నిహతులైన హెటిరో పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు పేర్లను గతంలోనూ రాజ్యసభ, ఎమ్మెల్సీలకు పరిశీలించినప్పటికీ వివిధ సమీకరణల వల్ల వారికి అవకాశం ఇవ్వలేదు.

మొత్తానికి ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమే కానుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరహాలో ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా ముమ్మర కసరత్తు చేశారు. మూడుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశించినా చివరకు వివిధ సమీకరణాలతో వీరివైపే మొగ్గుచూపారు.

Tags:    

Similar News