Telangana: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్‌

Telangana: శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి పూజలో పాల్గొననున్న సీఎం * ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్న కేసీఆర్‌

Update: 2021-03-04 02:07 GMT

ఫైల్ ఇమేజ్ 

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరి యాదాద్రి చేరుకుంటారు. ముందుగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పూజలో పాల్గొంటారు. అనంతరం ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు సీఎం కేసీఆర్‌. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న, పూర్తయిన, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇప్పటికే 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు కొనసాగుతున్నాయి.

ఇక.. మెట్లు, ఇతర నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర 2 వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇది కూడా మరో 15 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఫిబ్రవరిలోనే యాదాద్రి ఆలయాన్ని పునర్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావించారు. కానీ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అది కాస్త వాయిదా పడింది. దీంతో క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించి.. ఓ అంచనాకు రానున్నారు సీఎం. అనంతరం చినజీయర్ స్వామితో చర్చించి ఆలయ ప్రారంభ తేదీపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Full View


Tags:    

Similar News