TIMS Hospital at Gachibowli: నేటి నుంచి.. టిమ్స్‌ సేవలు అందుబాటులోకి

TIMS Hospital at Gachibowli: రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.

Update: 2020-07-06 04:45 GMT

TIMS Hospital at Gachibowli: రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌)ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రైవేటు దవాఖానలోనూ ప్రత్యేక బెడ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే సోమవారం వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ గచ్చిబౌలిలో నిర్మించిన టిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. మంత్రి ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం టిమ్స్‌ లో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే టిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మరిన్ని బెడ్లను సిద్ధం చేస్తున్నది.

ఈ మేరకు సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అధికారులు, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలతో విడివిడిగా భేటీ అయ్యారు. సత్వర వైద్యం, పరీక్షల నిర్వహణ, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం ద్వారా వైరస్‌ కట్టడిచేయాలని నిర్ణయించారు. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇంటివద్దే వైద్యమందించడంతోపాటు, వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారిని నిత్యం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేయడంపై నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పాజిటివ్‌ వచ్చినవారికి తక్షణం వైద్యమందించేలా దవాఖానలను సిద్ధం చేస్తున్నారు.


Tags:    

Similar News