Telangana Bathukamma Celebrations : ఈ ఏడాది ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడంటే..?

Update: 2020-09-09 07:12 GMT

ప్రతీకాత్మక చిత్రం

Telangana Bathukamma Celebrations : ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. సద్దుల బతుకమ్మకు వారం రోజుల ముందునుంచే ఆడపడుచులు ప్రతి రోజు చిన్న చిన్న బతుకమ్మలు చేసి సాయంత్రం పూట ఆనందోత్సాహాలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడతారు. ప్రతి ఏడాది ఒక నిర్ణీత తేది ఉండడం వలన ఆదే తేది రోజు ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై తెలంగాణ ఆడపడుచుల్లో గందరగోళం నెలకొంది. అయితే గతంలో కూడా అంటే 1963, 1982, 2001 సంవత్సరాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొనడంతో పండితులు ఆడపడుచుల సందేహాలను నివృత్తి చేసారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ఆడపడుచుల గందరగోళానికి తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహిత సంఘం బాధ్యులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని 'కుడా' గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఎంగిలిపూలు ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాలపై చర్చించి ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

ఈనెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య కాబట్టి అదే రోజున ప్రతి ఏడాది లాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం దాంతో పాటుగానే ఆనవాయితీ ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని నిర్ణయించారు. నెల రోజుల అనంతరం అక్టోబర్‌ 17వ తారీఖున శనివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తిథి మొదలు 8 రోజుల పాటు బతుకమ్మ ఆడుకోవాలని తెలిపారు. ఆ తరువాత అదే నెల 24వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని నిర్ణయించారు.

ఇక పోతే సద్దుల బతుకమ్మ అంటే చాలు దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రమే ముందుగా గుర్తుకు వస్తుంది. ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోంది.

Tags:    

Similar News