కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌ సీరియస్‌

Komatareddy Rajagopal Reddy: కేసీ వేణుగోపాల్‌ నివాసంలో రాజగోపాల్‌ రెడ్డి ఇష్యూపై టీకాంగ్రెస్ నేతల చర్చ

Update: 2022-08-02 04:00 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌ సీరియస్‌

Komatareddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహార ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆరగంటకు పైగా సాగిన ఈ భేటీలో పార్టీ పటిష్టంపై తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాత్మక కార్యక్రమాలపై చర్చించారు.

ముఖ్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పైనే లోతుగా చర్చించారు. రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా మునుగోడు అంశంపై యాక్షన్ ప్లాన్ తయారు చేశామని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పదేపదే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయడానికే అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బుజ్జగించే ధోరణిలో వ్యవహరించిన కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడం రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడేందుకే మొగ్గుచూపుతున్నట్లు వార్తలపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తొలుత సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

Tags:    

Similar News