పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
BRS MLAs: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు పంపారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
BRS MLAs: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు పంపారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.
2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్. ఇటీవలనే బీఆర్ఎస్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ తరుణంలోనే అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం చర్చకు తావిస్తోంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తగిన సమయంలోపుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని 2024 నవంబర్ లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణ సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ ను కోరింది. మరో వైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.