Weather Update: ఆదిలాబాద్ జిల్లాలో మారిన వాతావరణం.. నెల రోజుల ముందు నుంచే..
Temperature Rise: అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా...ఏ కాలానికి ఆ కాలం ప్రత్యేకం.
Temperature Rise: అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా...ఏ కాలానికి ఆ కాలం ప్రత్యేకం. ఆదిలాబాద్‌లో అడవుల కారణంగా వర్షాకాలంలో అధికంగా వర్షాలు...శీతాకాలంలో రికార్డు స్థాయిలోచలితీవ్రత, వేసవికాలంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తుంటాడు. నిన్న మొన్నటి దాకా, అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రతలతో వణికిపోయిన ఆదిలాబాద్ వాసులు తాజాగా పగటిపూట పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు.
ఇంకా వేసవికాలం ప్రారంభం కాలేదు. అప్పుడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత వారం రోజుల వరకూ చలితో వణికిపోయిన ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం ఇప్పుడు పెరిగిన ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవికాలం అప్పుడే వచ్చిందా అన్నట్టు పరిస్థితులు మారాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం పగటి పూట ముప్పై డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి పూట పద్నాలుగు డిగ్రీల ఉత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పగటి పూట దాదాపు ముప్పై ఏడు డిగ్రీల అత్యధిక ఉష్టోగ్రతలు నమోదాకాగా, రాత్రి పూట పద్దెనమిది డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సరాసరి చూసుకుంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మధ్యాహ్నం పూట గాలిలో తేమ శాతం పడిపోయి వేడిగాలులు కూడా మొదలయ్యాయి.
ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం.. రెండు దశాబ్దాల క్రితం చూసామని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి మొదటి వారంలో ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గమనిస్తాం. కానీ దాదాపు నెల రోజుల ముందే ఇలాంటి వాతావరణం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్‌లో మరో రెండు, మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెబుతున్నారు.
ఫిబ్రవరి మాసంలోనే ఎండలు పెరిగిపోవడంతో మార్చి, ఎప్రిల్ మాసంలో ఎండలు ఏవిధంగా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వడగాల్పుల తీవ్రత మొదలవ్వడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా పరిస్థితులు మారాయి.