Weather Report: రథసప్తమి వేళ.. ఏపీ, తెలంగాణకు హీట్ అలర్ట్.. మండిపోనున్న ఎండలు
Weather Report: ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ ఎలాంటి వాతావరణ సూచనల చేయలేదు. ఎందుకంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉన్నాయి. కానీ భూమధ్య రేఖ ప్రాంతంలో 5 అల్పపీడనాలు, 2 తుఫాన్లు ఉన్నాయి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతానికి లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
శాటిలైట్ అంచనాలను చూస్తే ఏపీ, తెలంగాణపై రోజంతా చిన్నపాటి మేఘాలు వస్తూపోతుంటాయి. కానీ అవి చల్లదనాన్ని ఇవ్వలేవు. వాటిని మించిన వేడి భూమికి తాకుతోంది. సూర్యకిరణాలు డైరెక్టుగా తెలుగు రాష్ట్రాలపై పడుతున్నాయి. అందులోనూ నేడు రథసప్తమి కావడం కూడా మరోప్రత్యేకత. సూర్యుడి పుట్టినరోజు ఆమాత్రం వేడి ఉంటుంది కదా.
కాగా బంగాళాఖాతంలో గంటకు 25కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 13కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాలులన్నీ తుపాన్లు ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వైపు వెళ్లిపోతున్నాయి. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో గాలివేగం చాలా తక్కువగా ఉంది.
ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఏపీలో నేడు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంది. అందువల్ల మనం ఎండ వేడిమి నుంచి కాపాడుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. నీడపట్టున ఉంటూ..తప్పనిసరై అయితే బయటకు వెళ్లాలి. నీళ్లు, పండ్ల రసాలు వంటివి తీసుకుంటూ ఉండాలి.