Weather Report: ఏప్రిల్, మే నెలల్లో దంచికొట్టనున్న ఎండలు..46 డిగ్రీల ఉష్ణోగ్రత గ్యారెంటీ.. ఐఎండీ అలర్ట్
Weather Report: ఎండాకాలం ప్రారంభమైంది. ఈ ఏడాది వేసవి సీజన్ ఎలా ఉండబోతుందన్న అంశాలపై భారత వాతావరణశాఖ నివేదికను విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. 90 రోజుల వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటే ఏడు రోజుల పాటు రాష్ట్ర మంతటా తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. దక్షిణ, మధ్య తెలంగాణతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని ఆయన వివరించారు.
దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వివరించారు. మధ్య తెలంగాణతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యో అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారి తెలిపారు. రాత్రిపూట కూడా దక్షిణ, ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మార్చి చివరి రెండు వారాల ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారి వివరించారు. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు
గత 12ఏళ్ల దీర్ఘకాలిక సమాచారాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశం అంతా కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగినట్లుగా తెలుస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో వడగాలుల తీవ్రత ఉంటుందని వివరించింది. 5నుంచి 7 రోజుల వరకు కూడా వడగాల్పుల తీవ్రత రాష్ట్రమంతటా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారి ధర్మరాజు తెలిపారు.