Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాల కలకలం
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. మొన్న కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధం ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం విషాదం నింపింది.
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాల కలకలం
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. మొన్న కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధం ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం విషాదం నింపింది. టిప్పర్ మృత్యు శకటం అయింది. 20మందికి పైగా చనిపోగా... చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది.
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరింది. చేవెళ‌్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సును కంకర లారీ ఢీకొంది. బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా 19మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 10మందికి చికిత్స అందిస్తున్నారు. మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రిలో 10మందికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 నెలల పసికందు ఉన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలం హృదయ విదారకంగా మారింది. టిప్పర్‌లో కంకర బస్సులో పడటంతో కంకరలోనే పలువురు కూరుకుపోయారు.
సహాయ చర్యల్లో పాల్గొన్న చేవెళ‌్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాలుపై నుంచి జేసీబీ వెళ్లడంతో గాయపడ్డారు. అతన్ని చేవెళ‌్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ రాధకు స్వల్ప గాయాలు కాగా... ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులున్నారు. ఆదివారం సొంతూళ్లకు వచ్చిన వారు సోమవారం ఉదయం నగరానికి బయలుదేరారు. కొద్దిసేపట్లో నగరానికి చేరుకుంటామకున్న సమయంలో టిప్పర్ మృత్యు రూపంలో కబలించింది. ప్రమాద స్థలం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేవెళ్లలోనే అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మీర్జాపూర్ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి 50వేల చొప్పున ప్రకటించారు. మీర్జాపూర్ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 99129 19545, 94408 54433లో ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం పొందవచ్చు.