Telangana Prisons Annual Report 2025: మహిళా ఖైదీల సంఖ్య పెరిగింది.. తెలంగాణ జైళ్ల శాఖ గణాంకాలు
Telangana Prisons Annual Report 2025: తెలంగాణ జైళ్ల శాఖ 2025 వార్షిక నివేదిక విడుదల చేసింది. ఖైదీల అడ్మిషన్లలో 11.8% వృద్ధి నమోదు కాగా, సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించిందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.
Telangana Prisons Annual Report 2025 :
Telangana Prisons Annual Report 2025 :తెలంగాణ జైళ్ల శాఖ 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే జైళ్లలో ఖైదీల అడ్మిషన్లలో 11.8 శాతం వృద్ధి నమోదైందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.
చంచల్‌గూడలోని ప్రిసెన్స్ అకాడమీలో జైళ్ల శాఖ వార్షిక నివేదికను ఆమె అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు.
2024 సంవత్సరంలో రాష్ట్రంలోని జైళ్లలో మొత్తం 34,811 మంది ఖైదీలు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 36,627కి పెరిగిందన్నారు. సైబర్ నేరాల కేసుల్లో 2024లో 757 మంది ఖైదీలు ఉండగా, 2025లో ఆ సంఖ్య 1,784కి చేరిందని వెల్లడించారు.
అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుపాలైన వారి సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదైందన్నారు. 2024లో ఈ కేసుల్లో 1,124 మంది ఖైదీలు ఉండగా, 2025లో ఆ సంఖ్య 2,833కి పెరిగిందని, అంటే దాదాపు 150 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.
వయస్సు పరంగా చూస్తే జైళ్లలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే అత్యధికంగా ఉన్నారని డీజీ తెలిపారు. ఈ ఏడాది 31 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ఖైదీలు 19,318 మంది ఉన్నట్లు చెప్పారు.
మహిళా ఖైదీల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొన్నారు. 2024లో 2,785 మంది మహిళా ఖైదీలు ఉండగా, 2025లో ఈ సంఖ్య 2,880కి చేరిందన్నారు.
జైళ్ల శాఖలో ఆధునికీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఇ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించామని తెలిపారు. అలాగే జైల్ అదాలత్ కార్యక్రమం ద్వారా 1,558 కేసులను పరిష్కరించి, 985 మంది ఖైదీలను విడుదల చేసినట్లు డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.