Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
Mahesh Kumar Goud: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సర్వే నివేదికల ఆధారంగా, గెలుపు గుర్రాలకే బీఫామ్‌లు ఇస్తామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, అదే ఊపు మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలే మా శ్రీరామరక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓట్ల రూపంలో మారుతాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పేదలకు అందకపోయిన సొంతింటి కల, కాంగ్రెస్ హయాంలో నెరవేరుతోందని.. రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను కేటాయిస్తామన్నారు.
బీజేపీపై విమర్శల దాడి
ప్రధాని మోదీ హయాంలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. "దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీ సంస్కృతి. కాంగ్రెస్‌కు అలాంటి అలవాటు లేదు. బీజేపీ నేతలు తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలి" అని ఆయన సవాల్ విసిరారు.