Telangana police: ప్లాస్మా దానంపై ప్రత్యేకంగా కృషి చేస్తున్న తెలంగాణా పోలీసులు!

Update: 2020-08-06 11:02 GMT

Telangana police: శాంతి భద్రతలతో పాటు మరో అతి పెద్ద బాధ్యతను తెలంగాణ పోలీస్ శాఖ భుజస్కంధాలపై వేసుకుంది. కరోనా రోగులకు ప్రాణాధారమవుతున్న ప్లాస్మా దానం ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నారు.. దీని కోసం ప్రత్యేక పోర్టల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ప్లాస్మా దానం చేయాలంటూ ఓ వైపు ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే మరోవైపు తెలంగాణ పోలీసులు ప్లాస్మా డోనార్స్ గా మారి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల పోలీసులు ఆదర్శంగా తీసుకుంటున్నారు.

కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స విధానాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. దీని కోసం ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాల్లో ప్లాస్మా బ్యాంకులు ప్రారంభమయ్యాయి. తాజాగా సైబరాబాద్, హైదరాబాద్‌, రాచకొండ పోలీసులు ప్లాస్మా దానం చేసేందుకు వస్తున్న వారికి అండగా నిలుస్తున్నారు. ప్లాస్మా దానం వల్ల ఇతరుల ప్రాణాలు నిలబెట్టవచ్చని ఒకవైపు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రచారం చేస్తుంటే, మరోవైపు పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్మా దానం చేసేందుకు వస్తున్న వారిలో వైద్య సిబ్బంది, పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు 10 రోజుల్లో 160 మంది ప్లాస్మాను దానం చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ప్లాస్మా దానం చేసే వారిని ప్రాణ దాతలుగా కొనియాడారు.

సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిదులు "డొనేట్ ప్లాస్మా SCSC డాట్ IN" పేరిట ప్లాస్మా వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. ఇటీవలే ప్లాస్మా దానంలో కొన్ని మోసాలు, అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు పోర్టల్ పై నిఘా పెట్టారు. ఎవరైనా ప్లాస్మా దానం విషయంలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. SCSC డాట్ IN వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన 10 రోజుల్లోనే 210 మంది కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేశారు. ప్రస్తుతం 500 మందికి పైగా బాధితులు ప్లాస్మా కావాలని పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు.

ఇక ప్లాస్మా దానం చేసేందుకు 18-60 ఏళ్ల లోపు వారు, 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారు అర్హులు. డయాబెటిస్‌, క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, గర్భిణులు ప్లాస్మా దానానికి అనర్హులని ఐసీఎంఆర్‌ సూచించింది. అర్హులైన దాతలు ప్రతి రెండు వారాలకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయవచ్చు. ఇలా సేకరించిన ప్లాస్మాను అతి శీతల వాతావరణంలో కనీసం సంవత్సరం వరకు భద్రపరచవచ్చు. కొవిడ్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొన్న తరువాత 14 రోజుల వరకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తి ప్లాస్మా దానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ప్లాస్మా దానం విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడంతో మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులను అభినందిస్తున్నారు. తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకున్న మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటను అనుసరిస్తున్నాయి.


Tags:    

Similar News