మే 3 నుంచి ఇంటర్‌ పరీక్షలు!

Update: 2021-01-21 13:00 GMT

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్‌ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1నుంచి డైరెక్ట్‌ క్లాసులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్‌ కేలండర్‌ రూపకల్పన, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ రూపకల్పనపై ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్‌ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పరీక్షలను 70శాతం సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే తొలగించే 30శాతం సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్‌మెంటల్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గతేడాది మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ఫస్టియర్‌ విద్యార్థులను పాస్‌ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు ఇచ్చి పాస్‌ చేసింది. కానీ ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది.

Tags:    

Similar News