హైదరాబాద్‌లో 32 ప్రత్యేక బస్సులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-05-23 07:10 GMT

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేసేందుకు అనుమతించింది. కాగా హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. 32 రూట్లలో నడవనున్న ఈ ప్రత్యేక బస్సులు శనివారం నుంచి ఉద్యోగులకు అందుబాటులోకి రానున్నాయి. దూర ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వచ్చే మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు, సొంత వాహనాలు లేని వారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సకాలంలో కార్యాలయాలకు, తిరిగి ఇండ్లకు చేరుకోలేక పోతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. ఈ బస్సుల్లోకి ఎక్కాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని అప్పుడే వారికి లోనికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను తెలుసుకుని బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ కు టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఆయా కార్యాలయాల్లో పని చేసేవారి సౌకర్యార్థం పని వేళల్లో ప్రభుత్వం బస్సులను నడుపుతుండడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం సగం వేతనం మాత్రమే ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా మే నెలలో పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారుల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మమత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ సోమేశ్‌కుమార్‌కు శుక్రవారం వారు లేఖ రాశారు. అంతే కాకుండా రాబోయేది రంజాన్‌ పండగను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులకు అడ్వాన్సులు చెల్లించాలని సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ కోరారు.


Tags:    

Similar News