Sammakka Sagar Project: సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపిన ఛత్తీస్‌గఢ్ సీఎం

Sammakka Sagar Project: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Update: 2025-09-23 05:56 GMT

Sammakka Sagar Project: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ అధికారులతో కలిసి రాయపూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్టుదేవ్ సాయిని కలిశారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎంకు ఒక పత్రాన్ని సమర్పించారు. సీఎం విష్ణుదేవ్‌కి సమ్మక్కసాగర్‌ ప్రాజెక్ట్‌ను వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ వివరించారు. సమ్మక్కసాగర్ బ్యారేజ్ ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో నిర్మాణంలో ఉందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీడు, ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన నల్గొండ, వరంగల్‌ జిల్లాలో నీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. తాగునీటి కొరతను మాత్రమే కాకుండా భారీ స్థాయిలో సాగునీటి ప్రయోజనాలను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందన్నారు. ప్రాజెక్టు ప్రణాళికల ప్రకారం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–II కింద 1 లక్షా 78 వేల హెక్టార్ల ఆయకట్టును స్థిరపరుస్తుందన్నారు. రామప్ప, పాకాల లింక్ కెనాల్ కింద 12 వేల 146 హెక్టార్ల కొత్త ఆయకట్టును ఏర్పాటుకు నాంది పలుకుతుందన్నారు.

నల్గొండ, వరంగల్‌ల్లోని కొన్ని ప్రాంతాలు అధిక ఫ్లోరైడ్ కారణంగా.. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయన్నారు. భూగర్భజలంపై ఆధారపడడం తగ్గించడానికి గోదావరి ఆధారిత సురక్షితమైన నీటిని అందించడానికి సమ్మక్కసాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని సీఎంకు వివరించారు. సాగునీరు, తాగునీటి అవసరాలను ఒకే సమయంలో తీర్చడం ద్వారా తెలంగాణలో లక్షలాది మందికి ఈ ప్రాజెక్టు ప్రాణాధారంగా మారుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ విస్తృతంగా లాభపడినా.. ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం, తహసీల్‌ పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్ ఇప్పటికే తన ఆందోళనలను వ్యక్తపరిచిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనలను తెలంగాణ గుర్తించి, తదనుగుణంగా వ్యవహరించిందని తెలిపారు. పరిహారం, పునరావాసం యొక్క అంచనా ఖర్చుల వివరాలను పొందడానికి రాష్ట్రం అనేక సందర్భాల్లో ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు. ముంపును అధ్యయనం చేయడానికి ఛత్తీస్‌గఢ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌ను నియమించిందని, ఆ అధ్యయన ఫలితాలను అంగీకరించి అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

భూసేకరణ నిబంధనల ఆధారంగా లెక్కించి, ఎన్‌ఓసీ పత్రాన్ని జారీ చేసే సమయంలో నగదును చెల్లించబడుతుందని వివరించారు. ఈ చర్య ఆమోద ప్రక్రియలో ఆర్థిక లేదా పరిపాలనా ఆలస్యాన్ని తొలగించడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. విశ్ణుదేవ్ సాయి సానుకూల స్పందనతో ఈ అంశం ఇప్పుడు త్వరగా అధికారిక నిర్ణయానికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నల్గొండ, వరంగల్‌కే కాకుండా తెలంగాణలోని విస్తారమైన ప్రాంతాల్లో సాగునీటిని స్థిరపరచడానికి కూడా అత్యంత ముఖ్యమైనది అని ఆయన అన్నారు.

Tags:    

Similar News