అప్పుడు జీఎస్డీపీలో 19 శాతమే అప్పు తెచ్చేవారు.. కానీ ఇప్పుడు ఒక్కో నిమిషానికి కోటిపైనే అప్పు
అప్పుడు జీఎస్డీపీలో 19 శాతమే అప్పు తెచ్చేవారు.. కానీ ఇప్పుడు ఒక్కో నిమిషానికి కోటిపైనే అప్పు
Telangana BJP MLA Maheshwar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్డీపీలో కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. అందులోంచి 19 శాతం అప్పులు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీ 16 లక్షల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ దానిమీద 50 శాతం అప్పులు తీసుకొచ్చే దుస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బీజేపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ బడ్జెట్ పై చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమిషానికి కోటికిపైనే అప్పులు చేస్తోందన్నారు. రోజుకు రూ. 1700 కోట్లకుపైగా అప్పులు తీసుకొస్తోందని చెప్పారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక్కో వ్యక్తి తలపై రూ. 2.27 లక్షల అప్పు ఉందన్నారు.
ఎన్నో ఉద్యమాలు చేస్తే, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తోంటే రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చుకోవడానికే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నట్లుగా అనిపిస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ బడ్జెట్ పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టేలా, ఇచ్చిన హామీలను గాలికొదిలేసేలా ఉందని ఆయన మరోసారి తన అభిప్రాయాన్ని చెప్పారు.