TS Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం

TS Assembly: ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభం

Update: 2022-09-12 01:28 GMT

TS Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభంలో దివంగత పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత కేంద్ర విద్యుత్ చట్టంపై లఘు చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు రానున్నాయి.

ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్‌ సభకు సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్‌ డిస్కమ్, ట్రాన్స్‌కో, టీఎస్‌ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020- 21 ఆడిట్‌ రిపోర్ట్, స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ రెగ్యులేషన్స్‌ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు.

ఇక వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నది. వీటిలో మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ, అటవీ యూనివర్సిటీకి సంబంధించిన, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక, ఇదే సమయంలో కేంద్రం పైన రాజకీయ యుద్దం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పైన సభలోనే చర్చించి.. కేంద్ర తీరును ఎండగడుతూనే తెలంగాణ నమూనా.. దేశానికి అవసరమన్న వాదనను వినిపించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో జాతీయ పార్టీ ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండ్రోజులు జరిగే సమావేశాలను సద్వినియోగం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా సమావేశాలు జరగనునన్నట్లు తెలుస్తోంది. కేంద్రం - రాష్ట్రం అంశాలపైనే రెండ్రోజుల పాటు చర్చసాగే అవకాశం ఉంది. 

Full View


Tags:    

Similar News