ఇవాళ ఐదోరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు

Telangana Assembly: ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు

Update: 2023-12-20 02:17 GMT

ఇవాళ ఐదోరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు

Telangana Assembly: ఇవాళ ఐదోరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. మెదక్‌ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించనుంది. అనంతరం.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో లఘు చర్చ జరగనుంది. అధికార పార్టీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనుంది. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, అప్పుల గణాంకాలతో కూడిన శ్వేతపత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.

గత పదేళ్లుగా తెలంగాణకు వస్తున్న ఆదాయం, ఖర్చు, తెచ్చిన అప్పులను సభలో వివరించనుంది. అలాగే.. రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చుల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన విధానాలను సభ ముందు పెట్టనుంది. అయితే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కూడా తమకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని కలిసి వినతిపత్రం సమర్పించింది. అధికార కాంగ్రెస్‌పై ఎదురుదాడికి పూర్తి వివరాలతో బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. గతంలో తమకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశం కేసీఆర్‌ సర్కార్‌ ఇచ్చిందా అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిలదీశారు. దీంతో.. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు 39 మంది ఉండటంతో.. అధికార పక్షంపై గట్టిగా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News