తాలిపేరు అదనపు గేట్ల నిర్మాణానికి అడ్డంకి.. కొట్టుకుపోయిన గేటు స్థానంలో అదనపు గేట్లు బిగించేదెన్నడు?

* గేట్లు నిర్మిస్తే దక్కనున్న పంట పొలాలు..గేట్లు నిర్మించి ఆదుకోవాలని రైతుల వినతి

Update: 2022-11-24 02:42 GMT

తాలిపేరు అదనపు గేట్ల నిర్మాణానికి అడ్డంకి

Taliperu Project: కాంట్రాక్టర్ అలసత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది. పన్నెండేళ్ల క్రితం మూడు అదనపు గేట్లను నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అదనపు గేట్ల నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టర్ దక్కించుకుని పనులు ప్రారంభించారు. ఇంతవరకు అదనపు గేట్ల నిర్మాణం పూర్తి కాలేదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో గోదావరి, తాలిపేరు నదులు ప్రవహిస్తుంటాయి. కానీ ఇక్కడి భూములకు సాగు నీరు అందకపోవడంతో ప్రతి ఏటా పంటలు ఎండిపోతాయి దీంతో 1979లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చర్ల మండలంలోని తాలిపేరు నదిపై ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పంట పొలాలకు సాగు నీటిని విడుదల చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని భూములు సస్యశ్యామలమయ్యాయి. కుడి, ఎడమ కాలువల కింద 24 వేల 700 ఎకరాల్లో వరి, మిర్చి, పత్తి పంటలు సాగవుతున్నాయి.

ఈ ప్రాజెక్టును 25 గేట్లతో నిర్మించారు. వరదల సమయంలో వీటి ద్వారా 2 లక్షల 40 వేల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి వెళ్లేలా డిజైన్ చేశారు. అయితే 2006 సంవత్సరంలో భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి 2 లక్షల 75 వేల క్యూసెక్కుల వరద రావడంతో ఒక గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టుకు రక్షణగా 30 వేల క్యూసెక్కుల వరద నీరు వెళ్లేలా మరో మూడు అదనపు గేట్ల నిర్మాణ పనులు 2010లో ప్రారంభమయ్యాయి. వీటితోపాటు కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులకు ప్రభుత్వం 44 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.

పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కాలువల ఆధునికీకరణ పనులను మమ అనిపించారు. నిధులు చాలడం లేదనే కుంటిసాకుతో అదనపు గేట్ల నిర్మాణం నిలిపేశాడు. దీంతో 64 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెంచారు. ఇందులో 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ పనులు అసంపూర్తిగానే మిగిలాయి. నిధులు సరిపోలేదనే సాకుతో మరోసారి పనులు నిలిపివేయడంతో అదనపు గేట్ల నిర్మాణం పూర్తి కాలేదు. నిర్ణీత గడువు ముగిసినప్పటికి గేట్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇరిగేషన్ అధిదికారులు సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ ఏజెన్సీ రైతాంగానికి భరోసా కల్పిస్తున్న తాలిపేరు ప్రాజెక్ట్‌కు ఎటువంటి ప్రమాదం సంభవించక ముందే అదనపు గేట్ల నిర్మాణం పూర్తి చేయాలని రైతాంగం కోరుతోంది.

Tags:    

Similar News