Students Moving to Fields with No Schools: పొలం బాట పడుతున్న విద్యార్థులు

Update: 2020-07-27 10:24 GMT

Students Moving to Fields with No Schools: బడిగంట ఇంకా మోగడం లేదు. దీంతో బతుకు పంట పండించేందుకు కదులుతున్నారు ఆ చిన్నారులు. కలం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు హలం పట్టి పొలాలను దున్నుతున్నాయి. కరోనా కాలంలో పాఠాలు ఎలాగూ లేవు. బతుకు పాఠాలైనా నేర్చుకుందామని పొలం బాట పడుతున్నారు విద్యార్థులు కరోనా కాలంలో ఏం చక్కా పొలం పనులు నేర్చుకుంటున్న చిన్నారులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు అందిస్తుండడంతో ప్రైవేట్ విద్యార్థులు తమ చదువులు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులకు అవకాశమే లేదు. దీంతో విద్యార్థులు చదువులకు దూరమై పొలం పనులపై దృష్టిపెట్టారు. వర్షాలు విరివిగా పడడంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీలు దొరకడం లేదు. దీంతో విద్యార్థులే తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. కన్నవాళ్ల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. కలుపు తీస్తూ ఎరువులు వేస్తూ అరక దున్నుతూ పొలం పనుల్లో ఫుల్ బీజీగా కరోనా కాలాన్ని గడుపుతున్నారు.

జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో ఖాళీగా ఉండలేక ఆ ముగ్గురు చిన్నారులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పొలంలో హాయ్ గా వ్యవసాయ పనులు చేస్తున్న ఈ విద్యార్థులది జిల్లాలోని గట్టు మండలం బింగిదొడ్డి తాండ గ్రామం. స్కూల్ లేకపోవడంతో తమ తల్లిదండ్రులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో జడ్చర్ల, బాలనగర్ , రాజాపూర్, నవాబుపేట, మిడ్జిల్ మండలాలోని దాదాపు సగానికిపైగా విద్యార్థులు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 89 ప్రభుత్వ పాఠశాలల్లో 10వేల 5వందల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే 60 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 27 వేల 3వందలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటితో పాటు పలు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జడ్చర్ల నియోజకవర్గంలోని విద్యార్థులు ఇప్పుడు వ్యవసాయ పొలాల్లో కనిపిస్తున్నాయి. కూలీల కరువు ఏర్పడిన ఈ సమయంలో పిల్లలు తమకు సాయంగా నిలుస్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. చిన్నారులు వ్యవసాయపనులు నేర్చుకోవడం మంచిదే కానీ విద్యార్థులు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News