TS Lockdown: లాక్‌డౌన్‌ రూల్స్ ఉల్లంఘిస్తే కేసులే: డీజీపీ

లాక్‌డౌన్‌ ను కఠినంగా అమలు చేయాలని, రూల్స్ తప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

Update: 2021-05-11 17:15 GMT

తెలంగాణ డీజీపీ మహేంధర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

TS Lockdown: తెలంగాణలో రేపటి నుంచి అమలు కానున్న లాక్‌డౌన్‌ ను కఠినంగా అమలు చేయాలని, రూల్స్ తప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరచాలని పోలీసులకు సూచించారు. ఈమేరకు మంగళవారం రాత్రి డీజీపీ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ అధికారులందరూ తప్పకుండా ఫీల్డ్‌లో ఉండాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా ప్రధాన కేంద్రాల్లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసేలా చూడాలని కోరారు. వ్యవసాయ సంబంధిత పనులు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. అలాగే నేషనల్ హైవేలపై రవాణాలో ఎటువంటి ఆంక్షలు లేవని అన్నారు.

కాగా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపుకార్డులు తమవెంట ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో వ్యవసాయ, ఉపాధి హామీ పనులను లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపిస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపులా 40 మంది మాత్రమే హాజరవ్వాలని ఆదేశించారు. పెళ్లిళ్లకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. అంత్యక్రియలకు మాత్రం కేవలం 20 మందే హాజరవ్వాలని అన్నారు.

లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. అత్యవసర ప్రయాణాలకు ఈ- పాస్ విధానంలో కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారని డీజీపీ వెల్లడించారు.

Tags:    

Similar News