Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర

Mancherial: ప్రతి ఏటా స్వామిని దర్శించుకుంటున్న లక్షలాది భక్తులు

Update: 2022-02-24 04:38 GMT

 మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర

Mancherial: మహాశివరాత్రికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేళాల గ్రామ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి. గ్రామంలో ప్రతి ఏటా వేలాల శ్రీ గట్టు మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తారు. మార్చి1, 2వ తేదీల్లో నిర్వహించే జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, నిజామాబాద్, మహారాష్ట్రలోని సిరోంచ, గడ్చిరోలి జిల్లాల నుంచి శివభక్తులు లక్షలాదిగా తరలివస్తారు.

భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న జాతరలో దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గుట్టపై తాగడానికి చుక్క నీరు దొరకదు.. బిందెడు నీటికి .100 నుంచి .200 రూపాయలు వెచ్చిం చాల్సి వస్తోంది. శివరాత్రి రోజు భక్తులందరూ ఉపవాసం ఆచరిస్తారు. ఉదయమే గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు.. నదీ తీరంలో భక్తుల కోసం కనీస సౌకర్యాలు కనిపించవు.. మహిళలు మండుటెండలో బోనాలు ఎత్తుకుని.. పిల్లాపాపలతో గుట్టపైకి కాలినడకన చేరుకోవాల్సి వస్తుంది. దారి వెంట చలువ పందిళ్లు ఉండవు.. గుట్టపైన తాగునీరు లేక భక్తులు నరక యాతన అనుభవిస్తున్నారు.గ్రామానికి దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం.. అదికూడా సరిపడినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్క్ చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇతర ప్రభుత్వ శాఖలతో దేవాదాయ అధికారుల మధ్య సమన్వయ లోపమే అన్ని ఇక్కట్లకు కారణమవుతోంది. వివిధ రూపాల్లో ప్రతి ఏటా ఆలయానికి 50లక్షలకు పైగా ఆదాయం వస్తున్నా వసతుల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మల్లన్న స్వామి అంటే ముందుగా గుర్తుకొచ్చేది పట్నాలు. ఒగ్గు పూజారులతో భక్తులు పట్టువస్త్రాలతో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. కానీ... ఇక్కడ పట్నాలు. వేసేందుకు సరైన స్థలం లేదు. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒగ్గు కళాకారుల కోసం అవసరమైన స్థలం కేటాయించాలని భక్తులు కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారుతోంది. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రతి సారి విఫలమవుతూనే ఉన్నారు ఈ ఏడాదైనా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News