Kumbhmela: కుంభమేళా రోడ్డు ప్రమాదం..శోకసంద్రంగా మారిన నాచారం కార్తికేయనగర్
Kumbhmela: కుంభమేళాలో పుణ్యస్నామాచరించి ఇళ్లకు బయలుదేరిన నగరవాసుల్లో కొందరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరానికి చెందిన పలువురు మిత్రులు ప్రయాగ్ రాజ్ కు వెళ్లి మినీ బస్సులో వస్తుండగా..మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. వీరిలో నాచారం కార్తికేయనగర్ కు చెందిన ఐదుగురు, తార్నాకకు చెందిన ఒకరు, మరొకరు మూసారాంబాగ్ వాసి కూడా ఉన్నారు. తమ వారి రాకకోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, ప్రమాదం వార్త విని షాక్ అయ్యారు. ఇక ఎప్పటికీ తిరిగిరాని తెలిసి రోదించారు.దీంతో కార్తికేయనగర్ శోకసంద్రంలో మునిగిపోయింది.
నాచారం రాఘవేంద్రనగర్ కు చెందిన శశికాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. భార్య, ఇద్దరు కుమార్తెలు, 7 నెలల కుమారుడు ఉన్నారు. శశికాంత్ మరణంతో ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. తార్నాక గోకుల్ నగర్ లో ఉంటున్న ప్రసాద్, హిమాయత్ నగర్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య కుమారుడు ఉన్నారు. ప్రసాద్ మరణంతో ఆ కుటుంబం తీవ్రంగా విలపిస్తోంది. కార్తికేయ నగర్ కు చెందిన సంతోష్ గతేడాది భార్య అనారోగ్యంతో మరణించింది. ఇద్దరు పిల్లలను హాస్టల్లో చదివిపిస్తున్నారు. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులు మరణించడంలో పిల్లలు అనాథలుగా మారారు. పెళ్లిరోజుకు ముందే మరణించాడంటూ ఆయన సోదరి కన్నీంటి పర్యంతమయ్యారు.