పాములు పాలు తాగుతాయనేది మూఢ నమ్మకం..

Update: 2019-07-22 12:14 GMT

పాములు పాలు తాగవు, వాటిని పట్టి ఆడించటం వన్యప్రాణి చట్ట ప్రకారం నేరం

ఆగస్టు 5న నాగుల చవితి సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులతో అటవీ శాఖ సమావేశం

పర్యావరణ సమతుల్యతలో పాములు కూడా భాగమే, వాటిని పట్టుకుని హింసించొద్దు

అరణ్య భవన్ లో స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశం


పాములు పాలు తాగుతాయనే ప్రచారం ఒట్టి మూఢ నమ్మకమని, అలాంటివాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. ఆగస్టు ఐదున నాగ పంచమి రోజు దేవాలయాల దగ్గరకు ఎవరైనా పాములతో వస్తే వెంటనే అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. పాములను పట్టుకుని ఆడించటం, పాలు పట్టడం లాంటివి వన్యప్రాణి చట్టాల ప్రకారం జంతు హింస కిందకు వస్తాయని తెలిపారు. నాగ పంచమి సందర్భంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో అధికారులు అరణ్యభవన్ లో సమావేశం అయ్యారు. దేవాలయాలు, స్కూళ్లు, పంచాయితీ గ్రామ సభల వద్ద పాములపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పాములు పాలు తాగుతాయనే ప్రచారం ఎవరూ నమ్మొద్దని, పాములను పట్టేవారు వాటి నోటికి కుట్లు వేసి హింసిస్తారని, అందువల్ల అవి చనిపోయే ప్రమాదం ఉందని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు. పాములను పట్టుకుని హింసించే వారి వివరాలు అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364 కు తెలిపాలని అధికారులు కోరారు. ఈ నెల 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తో పాటు, అన్ని జిల్లాల్లో పులుల సంరక్షణ మీద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణకు హరితహారం,కొనసాగుతున్న తీరు, వివిధ ప్రాంతాల్లో మొక్కల లభ్యత, రక్షణ చర్యలపై స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అడిగిన సమాచారంపై అధికారులు స్పష్టతను ఇచ్చారు. ఇటీవల పామును పట్టుకునే క్రమంలో అదే పాము కాటుకు గురై మరణించిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుడు ధనుష్ అలియాస్ శ్రీనివాస్ కు సమావేశం నివాళి అర్పించింది.

సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీ.కే.ఝా, పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర రెడ్డి, డీఎఫ్ఓ పూజారి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శంకరణ్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైట్ అవినాశ్, WWF నుంచి ఫరిదా తంపాల్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News