SLBC Tunnel Latest Updates: సొరంగంలోంచి టీబీఎం ఆపరేటర్ మృతదేహం వెలికి తీసిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Latest Updates: ఎస్ఎల్‌బీసీ సొరంగంలోంచి టీబీఎం ఆపరేటర్ మృతదేహం వెలికి తీసిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel rescue operations latest updates: ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో టన్నెల్ బోర్ వెల్ మెషిన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. టీబీఎం ఆపరేటర్‌ను గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. సొరంగంలో మట్టి కూలిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో D2 పాయింట్ వద్ద కేరళ క్యాడవార్ డాగ్స్ మనుషుల ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే రెస్క్యూ టీమ్ తవ్వకాలు జరిపే క్రమంలో మెషిన్‌లో కూరుకుపోయిన కార్మికుడి చేయి కనిపించింది.
చేయి మాత్రమే మెషిన్ లోంచి బయటికి కనిపిస్తుండటంతో రెస్క్యూ టీమ్ కొన్ని గంటల పాటు శ్రమించి మెషిన్‌ను కట్ చేసింది. అందులోకి వెళ్లి చూడగా ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ శవం కనిపించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు ఆపరేటర్స్ టన్నెల్ బోర్ వెల్ మెషిన్ లో ఉన్నట్లుగా సొరంగంలోంచి బయటికొచ్చిన కార్మికులు చెప్పిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలింది. సొరంగం కూలిన సమయంలో దాదాపు 50 మందికిపైనే లోపల ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించి మిగతా వారు వెంటనే బయటికి వచ్చేసినప్పటికీ... మరో 8 మంది మాత్రం లోపలే టన్నెల్ బోరింగ్ మెషిన్‌కు అవతలి వైపున చిక్కుకుపోయారు. అప్పటి నుండి ఆ 8 మంది ఆచూకీ లేదు. ఇవాళ సాయంత్రం గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. ఇంకా మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
గత 16 రోజులుగా కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ లో వేగం పెంచడం కోసం రోబోటిక్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా పేర్కొన్న మంత్రి ఉత్తమ్... బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు.