SLBC tunnel collapse: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
SLBC tunnel tragedy latest updates: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారంఉదయం ఎస్ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. SLBC సొరంగం 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది వరకు కార్మికులు లోపల ఉన్నారు. వారిలోంచి 42 మంది సురక్షితంగా బయటపడినప్పటికీ మరో 8 మంది కార్మికులు సొరంగం లోపలే చిక్కుకున్నారు.
ఇదే విషయమై ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరాతీశారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుత పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యల గురించి వివరాలు అడిగారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఘటనా స్థలం వద్దే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి చెప్పారు.
అయితే, సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నుండి ఇంకా ఏమైనా సహాయం అవసరమైతే కోరాల్సిందిగా రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.