ప్రసాద్‌‌ స్కీమ్‌‌లోకి జోగులాంబ శక్తి పీఠం

Update: 2021-01-30 05:17 GMT

Jogulamba Temple

దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్‌‌లోని జోగులాంబ శక్తి పీఠాన్ని ప్రసాద్‌‌ స్కీమ్‌‌లోకి కేంద్ర ప్రభుత్వం చేర్చింది. 36 కోట్ల 73 లక్షల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో జోగులాంబ అమ్మవారి ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న పలు టెంపుల్స్​లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. అయితే, సీఎం కేసీఆర్..జోగులాంబ ఆలయానికి నూరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రసాద్ స్కీమ్‌‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి, అభివృద్ధి చేస్తోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేసింది. 36 కోట్ల 73 లక్షల రూపాయలను కేటాయించింది.

తుంగభద్ర నది ఒడ్డున అలంపూర్ లో ఉన్న అలంపూర్‌‌ దేవాలయం ఏపీలోని శ్రీశైలం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం, సిద్ధవటం ఆలయాలకు ముఖద్వారంగా పేరొందింది. మంత్రాలయం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు తప్పనిసరిగా జోగులాంబ అమ్మవారిని సందర్శిస్తుంటారు.

జోగులాంబ ఆలయానికి దగ్గర్లోనే 23 ఆలయాలతో కూడిన పాపనాసి ఆలయం, నవబ్రహ్మ ఆలయం, కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ స్థలంలో సంగమేశ్వరాలయం, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణ పుష్కర్ ఘాట్‌‌ఉన్నాయి.జోగులాంబ ఆలయాన్ని రోజుకు సగటున 2వేల మంది సందర్శిస్తుంటారు. వీకెండ్‌‌లో మాత్రం ఈ సంఖ్య 6,500 వరకు ఉంటుంది. ఇలా ఏటా 12 లక్షల మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. . 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల్లో 24 లక్షల మంది సందర్శించారని టూరిజం శాఖ లెక్క వేసింది.

ప్రసాద్ స్కీమ్ నిధులతో జోగులాంబ అమ్మవారి ఆలయంతోపాటు అనుబంధం టెంపుల్స్​ల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులకు రవాణ, వసతి సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జోగలాంబ క్షేత్రానికి ప్రపంచఖ్యాతి రానుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

ప్రసాద్ స్కీమ్ నిధులతో జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ది చేయడంపట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి వసతి, విశ్రాంతి గదులు, పుష్కర ఘాట్ తదితర అభివృద్ధి చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నది నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఉద్యమ నేతగా 2001లో జోగులాంబ ఆలయం నుంచి గద్వాల వరకు కేసీఆర్ పాదయాత్ర చేశారు. 2016 కృష్ణా పుష్కరాలకు విచ్చేసిన సీఎం కేసీఆర్ వంద కోట్ల రూపాయలతో జోగులాంబ ఆలయం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రూపాయికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇచ్చినమాటను సీఎం కేసీఆర్ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్ నిధులతో ఐదో శక్తిపీఠంగా పేరుగాంచిన జోగులాంబ అమ్మవారి ఆలయానికి మహార్ధశ రానుంది.

Tags:    

Similar News