Mahbubnagar: నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండచిలువ

Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఓ హృదయాన్ని వణికించే ఘటన చోటు చేసుకుంది.

Update: 2025-07-22 05:06 GMT

Mahbubnagar: నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండచిలువ

Mahbubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఓ హృదయాన్ని వణికించే ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకుడు చెన్నకేశవులు తన ఇంటి వరండాలో పరుపులో నిద్రిస్తున్న సమయంలో ఏడడుగుల పొడవు, 13 కిలోల బరువు గల కొండచిలువ అతని మంచంలోకి దూరింది. ఈ ఘటన స్థానికుల్లో ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని నెలకొల్పింది.

మూడు గంటల 45 నిమిషాల సమయంలో ఇల్లు ఎదురు ఉన్న కుక్కలు అకస్మాత్తుగా అరవడంతో చెన్నకేశవులు నిద్రలేచి తన పరుపులో ఏదో కదలిక గమనించి చూసే సరికి అది కొండచిలువ అని గుర్తించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తన పెద్దనాన్న సాయన్నకు సమాచారం అందించాడు.

చెన్నకేశవుల కేకలు విని స్థానికులు ఒక్కసారిగా గుమిగూడగా, ఆ కొండచిలువ పరుపు నుంచి బయటకి వచ్చి మెట్ల కింద దాక్కుంది. వెంటనే స్థానిక యువకుడు మల్లేశ్ వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించాడు. కృష్ణసాగర్ తన సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాశ్‌లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఎంతో నైపుణ్యంతో ఆ కొండచిలువను పట్టుకున్నారు.

చిలువను బంధించిన అనంతరం, పెద్దగూడె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ సమక్షంలో సురక్షితంగా వదిలేశారు. వర్షాకాలంలో ఇలాంటివి తరచుగా నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాములు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

Tags:    

Similar News