ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకునేందుకు.. బరిలోకి దిగుతున్న పలువురు ఎంపీలు.. మాజీ ఎంపీలు
Telangana: బీఆర్ఎస్‌లో అసెంబ్లీ టికెట్ల కోసం పలువురు ఎంపీలు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం
ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకునేందుకు.. బరిలోకి దిగుతున్న పలువురు ఎంపీలు.. మాజీ ఎంపీలు
Telangana: ఢిల్లీ కాదు.. గల్లీ పాలిటిక్స్‌కే మెజార్టీ ఎంపీలు మొగ్గుచూపుతున్నారా..? హస్తినలో కాదు...సొంత ఇలాకాలోనే పలుకుబడి పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నారా..? నాలుగు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టే బదులు ఒకే నియోజవర్గంలో స్ట్రాంగ్ లీడర్‌గా ఎదిగితే బాగుంటుందని పలువురు ఎంపీలు భావిస్తున్నారా.? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎంపీలుగా ఉన్న పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ రేవంత్, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి బడా నేతలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగబోతున్నారు. ఇటు బీజేపీలో సైతం కిషన్ రెడ్డి, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌లు ఎమ్మెల్యేగానే పోటీ ఉంటుందని చెప్పారు. ఇటు బీఆర్ఎస్‌లో టికెట్లు ప్రకటించినా...
ఎమ్మెల్యే టికెట్ కోసం పలువురు ఎంపీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు గట్టి ప్రయత్నాలు చేశారట. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన తలసాని సాయిని.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధినేత వద్ద ప్రయత్నాలు చేసిన్నట్లు గులాబీ గూటిలో చర్చ జరిగింది.
ప్రస్తుతం ఉన్న ఎంపీలే కాదు.. మాజీ ఎంపీలు సైతం ఎమ్మెల్యే అభ్యర్ధిగానే పోటీలో ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ బరిలోకి దింగేందుకు సిద్ధమవగా... రేణుకా చౌదరిని పార్టీనే బరిలో నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు బండి సంజయ్‌ని సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగమని కేంద్ర నాయక్వం చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బూర నర్సయ్యగౌడ్ సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ, రామచంద్రరావులు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు బీజేపీలో టాక్ నడుస్తోంది.
ఎంపీ నియోజకవర్గం అంటే దాదాపు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల నాయకులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలప్పుడు స్థానికంగా ఉన్న ఏ ఒక్క నేత సహకరించకపోయినా ఓటు బ్యాంక్ కోల్పోతామన్న ఆందోళనలో పలువురు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందే ఉన్నాయి కాబట్టి.. అదృష్టం పరీక్షించుకుందామన్న యోచనలో పలువురు నేతలు ఉంటే... ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న యోచనలో మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే అయి.. ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందవచ్చన్న యోచనలో కాంగ్రెస్,బీజేపీ పలువురు ఎంపీలు ఉంటే... ఎమ్మెల్యేగా గెలిస్తే... కేసీఆర్‌ను మంత్రి పదవి అడిగే అవకాశం ఉంటుందన్న యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించడంతో పాటు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో సైతం కీలక వ్యక్తి కావాలన్నది పలువురు నేతలు ఎత్తుగడ. అందుకే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే నేతలు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణలో పలువురు సిట్టింగ్ ఎంపీలు ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ కాకపోతే... తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలన్న ప్లాన్‌లో పలువురు నేతలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.