Telangana Liberation Day: సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన, విలీన, రైతాంగ త్యాగాల దినం

సెప్టెంబర్ 17.. తెలంగాణ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం నిజాం పాలన నుంచి స్వేచ్ఛను పొందిన సుదినం రాజరికపు పాలన చరమగీతం పాడిన రోజు నల్గొండలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం మహిళలపై అకృత్యాలకు పాల్పడిన రజాకార్లు రజాకార్లపై పెద్దఎత్తున తిరగబడిన ప్రజలు ఈ పోరాటంలో అసువులు బాసిన వందలాది రైతులు ప్రజాపోరాటానికి మద్దతుగా నిలిచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో విమోచనాన్ని చేపట్టిన కేంద్రం 1948 సెప్టెంబర్ 17న భారత్ లో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రం నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్న తెలంగాణ ప్రజలు..

Update: 2025-09-17 05:56 GMT

సెప్టెంబర్ 17… తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన తేదీ..నిజాం రాచరికపు పాలనకు చరమ గీతం పాడిన రోజు... 'హైదరాబాద్ సంస్థానం' స్వేచ్చా వాయువులు పీల్చి భారత దేశంలో కలిసింది ఈ రోజే..కొందరికి ఇది విమోచన దినోత్సవం… మరికొందరికి విలీనం..ఇంకొందరికి రైతాంగ పోరాట త్యాగాల 'విముక్తి' జ్ఞాపకం..నిజాం పాలన,సాయుధ రైతాంగ పోరాటం, ఆపరేషన్ పోలో, భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం ఇవన్నీ చరిత్ర పుటల్లో దాగిఉన్న వాస్తవాలు.. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ చరిత్ర పోరాటాల్లో చెరగని ముద్ర వేసింది.


1947 ఆగస్టు 15 న… భారతదేశం స్వతంత్రం పొందింది. కానీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలోనే కొనసాగింది. ప్రజలపై నిజాం రజాకార్ల దాడులు పెరిగాయి. రైతుల భూములు లాక్కోవడం, జమీందార్ల అణచివేత, మహిళలపై అకృత్యాలు ఇవన్నీ ప్రజల నుండి తిరుగుబాటుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. 1946 నుంచి 1951 వరకూ సాగిన ఈ ఉద్యమం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.


సాయుధ రైతాంగ పోరాట కాలంలో రజాకార్ల దాష్టీకానికి, నిజాం సైనికులు సృష్టించిన మారణ హోమానికి ప్రజలు పిట్టల్లా రాలారు. ఆ నెత్తుటి దారల్లోంచి పుట్టిన నిజాం వ్యతిరేక పోరాటానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కేంద్రం అయ్యింది. చౌటుప్పల్ సమీపంలోని గుండ్రంపల్లి లో రజాకార్ల తూటాలకు వందల మంది బలయ్యారు. రైతులు ఎదురు తిరిగారు. రజాకార్ల హింసకు ప్రతిఘటనగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు.కాసన గోడు,బొప్పారం, అల్వాల్, రావులపెంట, సూర్యాపేట,ఆలేరు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నల్గొండ–వరంగల్ సరిహద్దు ప్రాంతంలో రాత్రి వేళల్లో గేరిల్లా పోరాటం అత్యంత ప్రభావవంతంగా సాగింది. చిలుకూరు, నిడమనూరు, నక్కలపల్లి, మిర్యాలగూడ, పరిసరాలు.. విస్తృతంగా రైతాంగ ప్రతిఘటనలు సాగిన ప్రాంతాలుగా చరిత్రకెక్కాయి.. వందలాది మంది రైతులు ప్రాణాలు అర్పించి..సాయుధ రైతాంగ పోరాటాన్ని ఉధృతం చేశారు.


భారీగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. రజాకార్ల దాష్టీకాలపై ప్రజల తిరుగుబాటు జరుగుతుండగానే...కేంద్ర ప్రభుత్వం నిజాం పాలనలోని అరాచకాలను చూసి తట్టుకోలేకపోయింది. 1948 సెప్టెంబర్ 13న “ఆపరేషన్ పోలో” పేరుతో భారత సైన్యం నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌పై దాడి చేసింది. కేవలం ఐదు రోజుల్లో నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17, 1948 తేదీన హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో అధికారికంగా విలీనం అయ్యింది. నిజాం పాలనకు తెరపడింది. అయితే రైతాంగ పోరాటం మాత్రం 1951 వరకూ కొనసాగింది.


సెప్టెంబర్ 17 వ తేదీని ఒక్కో పార్టీ ఒక్కో పేరతో పిలుస్తూ.. తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. నిజాం పాలన నుండి విముక్తి పొందింది కాబట్టి బీజేపీ 'విమోచన దినోత్సవం' అని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం అంటూనే 'ప్రజా పాలన దినోత్సవం'గా జాతీయ జెండా ఎగురవేయాలని అధికారికంగా పిలుపునిచ్చింది. BRS పార్టీ 'జాతీయ ఏకీకరణ దినం'గా జరుపుకోవాలని చెబుతోంది.ఇక వామ పక్షాలు అయితే.. 'రైతాంగ పోరాట యోధుల త్యాగ దినం'గా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా.. ఎవరు ఏ పేరుతో పిలిచినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజుగా ఈరోజును చెప్పుకోవచ్చు.. చరిత్రలో చెరపలేని ఎన్నో జ్ఞాపకాలు ఈ రోజుతో చిరస్థాయిగా నిలిచాయి. స్వేచ్ఛ కోసం పోరాడిన తెలంగాణ యోధుల గాథలు ఎప్పటికీ మరువలేం..


Full View


Tags:    

Similar News