తెలంగాణ కాంగ్రెస్‌లో తారాస్థాయికి అంతర్గత పోరు..!

TS Congress Meeting: అశోక హోటల్‌లో సమావేశమైన సీనియర్ నేతలు

Update: 2022-03-21 01:57 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో తారాస్థాయికి అంతర్గత పోరు..!

TS Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. ఒకవైపు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు సీనియర్లు రోజుకో మీటింగ్ పెట్టి.. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ లైన్‌లో కాకుండా పీసీసీ ఛీఫ్ సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా సవాళ్లు విసిరే వరుకు పరిస్థితి వచ్చింది. అయితే పార్టీకి అంతర్గత కల్లోలం మంచిది కాదని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

లక్డీకాపూల్‌లోని అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్ నేతలంతా ప్రత్యేక సమావేశం కావడం కాక రేపుతోంది. రహస్య సమావేశాలు కాస్త బహిరంగా మీటింగ్స్‌గా మారుతున్నాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తులతో ఉన్న సీనియర్ నాయకులు వీహెచ్‌, మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు, పీసీసీ క్రమశిక్షణా కమిటి మెంబర్ శ్యామ్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చాలా మంది నేతలు హాజరవుతారని భావించిన... పార్టీ పెద్దల సూచనలతో చాలా మంది దూరంగా ఉన్నారు. మరోవైపు ఈ భేటీని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణించింది. పార్టీ సూచనలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించవద్దని మందే హెచ్చరించింది. వీహెచ్‌తో పాటుపలువురు సీనియర్ నేతలకు బోసురాజు ఫోన్‌ చేశారు. సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయినా వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి సమావేశమయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు మర్రి శశిధర్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి ఆందోళనకరంగా మారిందని సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. ఇక ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తమిళనాడు తరహా పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి మేలు చేయాలనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. పంజాబ్‌లో పీసీసీ చీఫ్ సిద్దు తోనే పార్టీ ఖతం అయ్యిందని.. తెలంగాణలో ఆలాంటి పరిస్థితి రావద్దన్నారు.

మరోవైపు తమకు షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతానని జగ్గారెడ్డి హెచ్చరించారు. సస్పెండ్ చేసినా అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటానని తెలిపారు. రేవంత్ తన సవాలు స్వీకరిస్తే తాను రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి అన్నారు.

మరోవైపు అశోకా హోటల్‌లో సీనియర్ల సమావేశం జరుగుతుండగానే కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయకార్, మానవతా రాయ్ వచ్చారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు వద్దంటూ దండంపెట్టి వేడుకున్నారు. అందరం కలిసి కట్టుంగా పనిచేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని బ్రతిమాలారు. అనతరం జగ్గారెడ్డితో అద్దంకి దయాకర్, మానవతారాయ్, బెల్లయ్య నాయక్ భేటీ అయ్యారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిని ఏకరువు పెట్టారు.

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో పరిణామం హాట్ హాట్‌గా మారుతోంది. పీసీపీ ఛీఫ్ తన పనితాను చేసుకుంటూ పోతుంటే.. సీనియర్లు వారివారి సమస్యలను తెరపైకి తేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసి త్వరలో అన్ని విషయాలు చెబుతామంటున్నారు. అయితే ఈ సమస్య త్వరగా సమసిపోతే పార్టీకి మంచిదని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News