వెయ్యి మైళ్ల ప్రయాణం...ఒక్క అడుగు తో ప్రారంభం

Update: 2019-12-03 10:18 GMT
మొక్కలు నాటుతున్నసీనియర్ ఐఏఎస్ అధికారి అధర్ సిన్హా

పర్యావరణాన్ని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హారం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకున్న ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చాలెంజ్ లో భాగంగా చాలా మంది ప్రముఖులు మొక్కలను నాటుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా మూడు మొక్కలను నాటారు. తనకు గ్రీన్ చాలెంజ్ ను విసిరిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.

మొక్కలు నాటిన అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ ని అందుకున్న వారిలో ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజా సదారాం, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌లు ఉన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అందరూ సంరక్షించాలని, ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా... ఒక్క అడుగు తోనే ప్రారంభమౌతుందని పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ నిరూపించారని అధర్ సిన్హా ఆయనని ప్రశంసించారు.

 


 

Tags:    

Similar News