Chinese Manja: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా..సంక్రాంతి ముందు కీసర ఘటనతో కలకలం
Chinese Manja: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ పండగ వస్తుందంటే చాలు నగరంలో హడావుడి అంతా ఇంతా కాదు.
Chinese Manja: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ పండగ వస్తుందంటే చాలు నగరంలో హడావుడి అంతా ఇంతా కాదు. అన్ని వయసులవారు డాబా, బిల్డింగ్‌లు ఎక్కి పోటాపోటీగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు. డీజే హోరులో సందడి చేస్తుంటారు. గాలిలోనే పతంగులను తెంచేయాలని హానికారక రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని ఉపయోగిస్తుంటారు. తెగి కింద పడిన ఈ చైనా మాంజాలతో ప్రజల గొంతులకు చుట్టుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజగా కీసరలో చోటు చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తుంది. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
సంప్రదాయ దారాన్ని వాడాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నాప్పటికీ చైనా మాంజాని కొందరు వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు. దీంతో పలువురు గాయాలపాలు కాగా.. పక్షుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో కూడా చైనా మాంజా చుట్టుకొని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఇంటర్ విద్యార్థి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపుగా 19 కుట్లు వేశారు. ఈ ఘటన అందరిని ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న పతంగుల పర్వం విషాదం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అధికారులు చెబుతున్నారు.
చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకే కాకుండా ప్రజలకు కూడా వీటి వల్ల ముప్పే. అందుకే ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్‌తో కూడిన నైలాన్, సింథటిక్ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. చైనా మాంజాలను తీసుకోవద్దని.. మన దగ్గర తయారైన సంప్రదాయ దారాన్ని వాడాలనంటున్నారు మాంజా వ్యాపారులు.
చైనా మాంజాపై నిషేధం ఉందని సంప్రదాయ దారాన్ని వినియోగించడమే మంచిదని పలువురు నగర వ్యాపారాలు చెబుతున్నారు. మాంజా ఎగురవేసేటప్పుడు విద్యుత్ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి ప్రయత్నం చేయకుండా క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగురవేయడం మేలు. ఇంటి డాబా పైన, మేడపైన గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.