TG Fancy Number Auction: ఫ్యాన్సీ నంబర్ కోసం అన్ని లక్షలా..? ఆ డబ్బుతో నాలుగు కొత్త కార్లు కొనేయొచ్చు!

ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరికి అది హోదా సూచిక అయితే, మరికొందరికి న్యూమరాలజీపై ఉన్న నమ్మకం.

Update: 2026-01-07 05:15 GMT

Hyderabad: ఫ్యాన్సీ నంబర్ కోసం అన్ని లక్షలా..? ఆ డబ్బుతో నాలుగు కొత్త కార్లు కొనేయొచ్చు!

ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరికి అది హోదా సూచిక అయితే, మరికొందరికి న్యూమరాలజీపై ఉన్న నమ్మకం. తమ వాహనం నంబర్ ప్లేట్‌పై ఇష్టమైన అంకెలు ఉండాలంటే ఎంతైనా ఖర్చు చేయడానికి వాహనదారులు వెనుకాడటం లేదు. దీనికి తాజా ఉదాహరణగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం నిలిచింది.

మంగళవారం జరిగిన ఈ వేలంలో రవాణా శాఖకు కాసుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే రూ. 43 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో అన్నిటికంటే హాట్ కేకులా మారిన నంబర్ TG 09 J 9999. ఈ నంబర్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా, చివరకు కీస్టోన్ ఇన్‌ఫ్రా సంస్థ ఏకంగా రూ. 18 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.

సాధారణంగా ఈ మొత్తంతో మారుతి సుజుకి సెలెరియో, టాటా టియాగో వంటి మధ్యతరగతి కార్లు నాలుగు వరకు కొనుగోలు చేయవచ్చు. నాలుగు కొత్త కార్ల ధరతో సమానమైన మొత్తాన్ని కేవలం నంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేయడం గమనార్హం. ఈ ఒక్క నంబర్ ద్వారానే ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది.

ఇతర ఫ్యాన్సీ నంబర్లకూ భారీ ధరలు

ఈ వేలంలో ‘9999’తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లు కూడా భారీ ధరలు పలికాయి. రవాణా శాఖ సంయుక్త కమిషనర్ రమేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం..

TG 09 K 0006 నంబర్‌ను అనంతలక్ష్మి కుమారి నిర్మల రూ. 7,06,666కు దక్కించుకున్నారు.

TG 09 K 0005 నంబర్‌ను నేహ అగర్వాల్ రూ. 1,89,001 చెల్లించి సొంతం చేసుకున్నారు.

TG 09 J 9909 నంబర్‌ను సాయివెంకట్ సునాగ్ పాలడుగు రూ. 1,44,999కు కొనుగోలు చేశారు.

TG 09 K 0009, TG 09 K 0001 నంబర్లను శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, ఇషాని కమోడిటీస్ సంస్థలు తలా రూ. లక్ష చొప్పున చెల్లించి దక్కించుకున్నాయి.

రవాణా శాఖకు వరంగా మారిన సెంటిమెంట్

చాలామంది తమ మొబైల్ నంబర్ నుంచి వాహన నంబర్ వరకూ ‘లక్కీ నంబర్’ లేదా వరుస అంకెలు ఉండాలని కోరుకుంటారు. ఈ సెంటిమెంట్ రవాణా శాఖకు వరంగా మారింది. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా మొత్తం రూ. 43,57,406 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గతంతో పోలిస్తే ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోందని, ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ వేలం విధానాన్ని అమలు చేస్తున్నామని జేటీసీ రమేశ్ వెల్లడించారు.

Tags:    

Similar News