World Economic Forum 2025: దావోస్ లో పెట్టుబడుల సాధనలో రేవంత్ సక్సెస్

World Economic Forum 2025: రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో 1 లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.

Update: 2025-01-25 06:16 GMT

World Economic Forum 2025: దావోస్ లో పెట్టుబడుల సాధనలో రేవంత్ సక్సెస్

World Economic Forum 2025: రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో 1 లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. 2024తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ పెట్టుబడులతో కొత్తగా 49,550 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే రేవంత్ సర్కార్ ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

టీ తాగుతూ చేసుకునే ఒప్పందాలకు యూరప్ వెళ్లాలా అంటూ ఆ పార్టీ సెటైర్లు వేసింది. దావోస్ పెట్టుబడులు బోగస్ అంటూ గతంలో కాంగ్రెస్ చేసిన విమర్శలను ఆ పార్టీ గుర్తు చేసింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టేందుకే ముందుకు వచ్చిన సంస్థలు పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని ఆ పార్టీ చెబుతోంది.

అయితే భారీ ఎత్తున పెట్టుబడులు తెస్తే అభినందించకుండా విమర్శలు చేస్తారా అని కాంగ్రెస్ మండిపడింది. దావోస్ లో ఒప్పందాలపై ఎవరి వాదన ఏంటి? గత ఒప్పందాలు ఏ మేరకు అమలయ్యాయి? ఈ ఏడాది ఒప్పందాలతో రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరుగుతుంది? దావోస్ లో కేటీఆర్ పై రేవంత్ ఏమన్నారు? దానికి కేటీఆర్ ఎలా రియాక్టరయ్యారు? దావోస్ తాము పూర్ అంటూ చంద్రబాబు ఎందుకు వ్యాఖ్యానించారనే విషయాలపై ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

Full View

తెలంగాణలో పెట్టుబడులకు 20 కంపెనీల అగ్రిమెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించారు. 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమెజాన్ సంస్థ 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయనుంది. 45 వేల కోట్లను సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ 15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. విప్రో సంస్థ హైదరాబాద్ గోపన్ పల్లిలో మరో క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది.

ఈ క్యాంపస్ తో మరో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మరో వైపు ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ లో మరో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీంతో 17 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.సన్ పెట్రో కెమికల్స్ సంస్థ నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్ ప్లాంట్లు, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నాయి.

తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ ఏరో స్పేస్ ముందుకు వచ్చింది. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇలా సుమారు 20 ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. తెలంగాణ రైజింగ్ 2050 విజన్ పేరుతో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.

2024లో జరిగిన ఒప్పందాలు ఎన్ని?

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్7న ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెల రోజుల్లోనే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 18 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఇందులో 17 సంస్థలు తమ పనులు ప్రారంభించాయి.

10 ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయి. ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభదశలో ఉన్నాయి. అప్పట్లో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 14 ప్రముఖ కంపెనీలున్నాయి. అయితే ఈ ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. అదానీ కంపెనీ, జేఎస్‌డబ్ల్యు వంటి కంపెనీలు ఇంకా తమ పనులు ప్రారంభించలేదని బీఆర్ఎస్ గుర్తు చేసింది.

ఎక్కడెక్కడ పరిశ్రమలు వస్తాయంటే ?

సాఫ్ట్ వేర్, ఫార్మా సూటికల్స్ వ్యాపారాలకు తెలంగాణ కీలకం. వీటిపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ముందుకు వెళ్లింది. 1 ట్రిలియన్ ఎస్‌జీడీపీ ఆర్ధిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డులోని అర్బన్ ప్రాంతం, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు, రీజినల్ రింగ్ రోడ్డుకు వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం స్థలాలను కేటాయించనున్నారు.

పెట్టుబడులకు రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే?

పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను రేవంత్ సర్కార్ దావోస్ లో పెట్టుబడిదారులకు వివరించింది. అర్బన్ మొబిలిటీ, మెట్రో రైలు, రీజినల్ రింగ్ రైల్వే , రేడియల్ రోడ్లు, కొత్త ఎయిర్ పోర్టులు, మౌళిక సదుపాయాలు, మూసీ పునరుజ్జీవం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్, స్కిల్ యూనివర్శిటీ అంశాలను పెట్టుబడిదారులకు వివరించింది రేవంత్ బృందం. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించడంతో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు అందించి రాయితీలను కూడా ప్రస్తావించారు. తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను కూడా పెట్టుబడిదారులకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

రేవంత్ దావోస్ టూర్ పై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి?

రేవంత్ రెడ్డి దావోస్ టూర్ పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. దీన్ని బోగస్ టూర్ గా విమర్శిస్తోంది. దావోస్ పెట్టుబడులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శల గురించి బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ విమర్శించారు. సన్ సంస్థ ఎండీ దావోస్ లో లేకున్నా ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఓ తప్పుడు ప్రకటన ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

అమెజాన్ సంస్థ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ లో టీ తాగుతూ ఒప్పందాలు చేసుకునే బదులు దావోస్ వెళ్లి చాక్లెట్లు తింటూ ఒప్పందాలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.మేఘా ,స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థలతో ఒప్పందాలపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే నాలుగు రోజులు దావోస్ లో పలు కంపెనీలతో ఒప్పందాలు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ ఒప్పందాలపై అభినందించకుండా విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

కేటీఆర్ పై రేవంత్ దావోస్ లో ఏమన్నారు?

మూడు రోజుల పాటు దావోస్ లో పలు పారిశ్రామిక వేత్తలు, కంపెనీలతో రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కేటీఆర్ గతంలో ఐటీ ఉద్యోగి. ఆయన అదే మైండ్ తో ఆలోచిస్తారని.. తాను రాజకీయ నాయకుడిని. పాలసీ మేకర్ లా ఆలోచిస్తానని తనకు కేటీఆర్ కు ఉన్న తేడా గురించి ఆయన వివరించారు.

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సమాధానమిచ్చారు. తనను ఐటీ ఉద్యోగి అంటూ కేటీఆర్ ఎక్స్ లో రిప్లయ్ ఇవ్వడంపై కౌంటరిచ్చారు. ఐటీ ఉద్యోగుల విద్యార్హతలు, నిబద్దత కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగలేరన్నారు. ఇలాంటి నాయకులు విధానాలకు మనం మూల్యం చెల్లించుకుంటామన్నారు.

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు సర్కార్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. నాలుగు రోజులు పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు చర్చలు జరిపారు. కాగ్నిజెంట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉందని త్వరలోనే ఆ సంస్థ నుంచి సమాచారం రానుందని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు.ఏపీలో పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఎన్విజ్ సీఈఓను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

15 అత్యున్నత సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు.స్విస్ మెన్, ఓర్లికాన్, ఆంగ్ట్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్ టైల్స్ సీఈఓలతో భేటీ అయ్యారు.మెర్సెక్, డేటా సెంటర్ల ప్రతినిధులతో పాటు ఆర్సెలాల్ మిత్తల్ గ్రూప్ ప్రతినిధులతో ఆయన చర్చించారు.1. 4 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సానుకూలంగా స్పందించారు. పెట్రోనాస్ సంస్థ 13-15 వేల కోట్లతో కాకినాడలో పెట్టుబడి పెట్టేందుకు సమ్మతించింది.

పెప్సికో ంపెనీ విశాఖలో తన సెంటర్ ను ఏర్పాటుకు సానుకూలతను తెలిపింది. ఏపీని హెల్త్, ఎడ్యుకేషన్, కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారేందుకు అవసరమైన సాయం చేయాలని బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరారు.గూగుల్ క్లౌడ్, హిందుస్థాన్, యునీలీవర్, సెన్మెట్ ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. అయితే ఏపీలో రెడ్ బుక్ పాలనతో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వైసీపీ నాయకురాలు ఆర్. కె. రోజా విమర్శించారు.

మేం పూర్.. అంటూ చంద్రబాబు ఎందుకన్నారు?

దావోస్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆయన ఈ సమావేశాలకు హాజరయ్యారు. దావోస్ లో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రేవంత్ రెడ్డిలతో కలిసి చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు పాల్గొన్నారు.

గ్లోబల్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులపై రాష్ట్రాల ఆకాంక్షలు ఎలా ఉన్నాయనే దానిపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఓ ప్రశ్నకు వాళ్లు రిచ్.. మేం వెరీ పూర్ అంటూ ఫడ్నవీస్, రేవంత్ రెడ్డిలను చూపుతూ చెప్పారు. ముంబై ఫైనాన్షియల్ కేపిటల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ హైయెస్ట్ ఫర్ క్యాపిటలా ఇన్ ఇండియా అని చంద్రబాబు తెలిపారు.అందుకే వాళ్లు రిచ్... మేం వెరీ పూర్ అంటూ ఆయన అనడంతో అంతా నవ్వారు.

ఏమైనా, భారత్ నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రుల్లో ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ స్టార్‌గా నిలిచారనే చెప్పాలి. తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే, ఈ సక్సెస్ కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో కనిపించడం ముఖ్యం. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా ప్రయత్నిస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News